‘అందుకే కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను’..

15 Mar, 2019 14:59 IST|Sakshi
ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు(ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడడానికి గొంతు ఉండకూడదనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో కలుపుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిద్దిపేటలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తాను, జీవన్ రెడ్డి ఇద్దరూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే 42 నియోజకవర్గాలలో ఉన్న సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. 22న జరిగే ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపిస్తే! రేపు జరిగే ఎంపీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందన్నారు.  2024లో జరిగే ఎన్నికలకు నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక పునాది కావాలని ఆకాంక్షించారు.

5 ఏళ్ల పాలనలో లక్షా 80 వేల కోట్ల అప్పు
తెలంగాణ రాష్ట్రం రాకముందు 60వేల కోట్ల అప్పు ఉంటే, కేసీఆర్‌ 5 ఏళ్ల పాలనలో లక్షా 80వేల కోట్ల రూపాయలకు అప్పు చేరిందని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కుట్రతో ఎమ్మెల్యేలను లాక్కోవడంతో ఎమ్మెల్సీలను పొందలేక పోయామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో.. ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులు ఎమ్మెల్సీలను ఎన్నుకొనే అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందు పడుతుంటే కేవలం 18 వేలు తప్ప మిగతావి పూర్తి చేయలేదన్నారు. 10వ పీఆర్సీ కాలం ముగిసిన ఉద్యోగులకు పీఆర్సీ పెంచలేదని తెలిపారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగులకు 10శాతం పీఆర్సీ ఇచ్చిందని, నిరుద్యోగులకు జీవనభృతి ఇస్తున్నారని వెల్లడించారు. మరి కేసీఆర్ ఏమిచ్చాడు అంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు