కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విమానం నిలిపివేత

18 May, 2018 16:10 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్టాటక కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రయాణించాల్సిన విమానాన్ని గంటలపాటు నిలిపివేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని శిబిరానికి వచ్చేందుకుగానూ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, మాజీ సీఎం సిద్దరామయ్య, ఆరుగురు తాజా ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆసీనులయ్యారు. కానీ.. విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేలు, నేతలు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్‌ వర్గాల్లో కలవరం పెరిగిపోయింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే విమానాన్ని నిలిపివేశారేమోనన్న అనుమానాలు వెల్లువెత్తాయి.

అందుకే బస్సుల్లో వచ్చారు..: కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం రాత్రి కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలనుకున్నా, అందుకు ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించడంతో చివరికి బస్సుల్లో తరలించారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి నేతలు శుక్రవారం బయలుదేరారు. గంటల నిరీక్షణ అనంతరం.. విమానానికి అనుమతి దొరకడంతో నేతలు హైదరాబాద్‌ వైపునకు ఎగిరివెళ్లారు.

తాజ్‌కృష్ణలో సీఎల్పీ భేటీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో సీఎల్పీ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శిబిరమైన హైదరాబాద్‌ తాజ్‌కృష్ణ హోటల్‌లోనే సాయంత్రం 5గంటలకు సీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి బలపరీక్షలో సభ్యులు అనుసరించాల్సిన విధానంపై సీనియర్లు సూచనలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు