-

తెలంగాణలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌!

6 Jun, 2019 14:28 IST|Sakshi

సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయండి..

స్పీకర్‌కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్‌ను వీడిన 12మంది ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో  సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య  ఉన్నారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు.  రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. అలాగే వీరంతా అసెంబ్లీ కార్యదర్శిని కూడా కలవనున్నారు.

కాగా గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరనప్పటికీ వారు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు.

దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే పోడెం వీరయ్య కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సాంకేతికంగా 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే... అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టమే. మరోవైపు తాజా పరిణమాలు కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు మింగుడపడటం లేదు. సీఎల్పీ కార్యాలయానికి చేరుకున్న భట్టి విక్రమార్క.. పార్టీ నేతలతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతకు ముందు ఈ ఎమ్మెల్యేలంతా ...టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు.

మరిన్ని వార్తలు