రైతు రుణమాఫీపై స్పష్టత లేదు : జీవన్‌ రెడ్డి

22 Jul, 2019 13:46 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: ఉద్యోగాల కల్పన, పెన్షన్ల వంటి అంశాల్లో సీఎం కేసీఆర్‌.. పక్కరాష్ట్ర ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఎంతో నేర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తెలిపారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని పాత లబ్ధిదారులందరికి పెన్షన్లు పెరిగాయన్నారు. అయితే కొత్త లబ్ధిదారుల ఊసే లేకపోవడం శోచనీయం అన్నారు. రుణమాఫీపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నిరుద్యోగ యువతను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

గడిచిన ఐదు సంవత్సరాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు జీవన్‌రెడ్డి. ఎన్నికల హామీల్లో చెప్పిన నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీలో ఉద్యోగులకు 27 శాతం పీఆర్‌సీ ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యోగుల మీద అవినీతిపరులనే ముద్ర వేసి వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. సీపీఎస్‌ రద్దు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు