కేసీఆర్‌ కనీసం నోరు మెదపడం లేదు: పొంగులేటి

5 Jul, 2018 18:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విభజన చట్టంలోని హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశానని, ఈ రిట్‌ పిటిషన్‌పై కేంద్ర ఉక్కు, ఆర్థిక, జల మంత్రిత్వశాఖలు కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేశాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ పిటిషన్‌ స్పందించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని కొన్ని హామీలను కేంద్రం ఇప్పటివరకు కనీసం ముట్టుకోలేదని ఆయన అన్నారు. రూ. 1350 కోట్లు ప్రత్యేక సహాయం కింద రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. ఉద్యమ సీఎం అని చెప్పుకొనే కేసీఆర్.. కనీసం ఈ విషయం మీద నోరు కూడా మెదపడం లేదని ఆయన తప్పుబట్టారు. తన పిటిషన్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించడం లేదని అన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం సిగ్గుచేటు అని పొంగులేటి మండిపడ్డారు. దీనికంటే ముఖ్యమైన విషయం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. నాలుగు కోట్ల ప్రజలకు ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ప్రధాని మోదీకి, బీజేపీ అధినేత అమిత్ షాకు కోపం వస్తుందనే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన హామీల విషయం, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌కు ఉందని అన్నారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అమరవీరుల త్యాగాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

 

మరిన్ని వార్తలు