బెదిరించడంతో విత్‌డ్రా! 

30 Apr, 2019 11:12 IST|Sakshi

నామినేషన్‌ విత్‌ డ్రాకు రూ.20 లక్షల ఒప్పందం

రూ. 10 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి విత్‌ డ్రా చేసుకోమని బెదిరింపులు

కాంగ్రెస్‌కు చెందిన గగ్గల్‌పల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఆరోపణ

బలవంతంగా విత్‌డ్రా చేయించారని ఇచ్చిన అడ్వాన్స్‌తో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌ : గగ్గలపల్లి ఎంపీటీసీ నామినేషన్‌ విత్‌డ్రా విషయంలో హైడ్రామా సాగింది. నాగర్‌కర్నూల్‌ మండలంలో తొలి విడతలో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఆదివారంతో ముగిసింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దొడ్ల వెంకట్‌ నారాయణ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి దొడ్ల ఈశ్వర్‌ రెడ్డితో పాటు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.

దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌ రెడ్డి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నిం గ్‌ అధికారులు ప్రకటించారు. ఇది వరకు బాగానే ఉన్నా.. తాను విత్‌డ్రా చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ సోమవారం కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ నారాయణరెడ్డి ధర్నాకు దిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో నలుగురు టీఆర్‌ఎస్‌ నాయకులు తనను ఈనెల 28న మధ్యాహ్నం 12.45గంటలకు గగ్గలపల్లి నుంచి కారులో బలవంతంగా తీసుకెళ్లి ఉయ్యాలవాడలోని ఓ టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లో బంధించి, రూ.20 లక్షలు ఇస్తామని నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోమన్నారని ఆరోపించారు. విత్‌డ్రా చేసుకోకుంటే కుటుంబసభ్యులపై దాడులు చేస్తామని బెదిరించి తన భార్యకు రూ.10లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టలేకపోయినా 28న విత్‌డ్రా చేసుకున్నానని ఆయన తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నారాయణరెడ్డి ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రాన్ని అందించారు.
 
మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్‌ రెడ్డి తమ పార్టీ అభ్యర్థిని బెదిరింపులకు గురిచేశారని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొండా మణెమ్మ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వారి వెంటనాయకులు పాపయ్య, మాజీ సర్పంచ్‌లు భార్గవి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ, నిరంజన్, నగేష్‌ తదితరులు ఉన్నారు.   
 

మరిన్ని వార్తలు