ఎన్నికలకు తొందరేంటి?

23 Jun, 2018 08:40 IST|Sakshi

శ్రీనగర్‌ : తాజా రాజకీయ పరిస్థితులపై జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా ఆధ్వర్యంలో అన్ని పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు డిమాండ్‌ చేయగా, పీడీపీ మాత్రం ఎన్నికలకు తొందరేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానోక దశలో భేటీలో గందరగోళం చెలరేగగా, నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు స్థానిక ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. 

కశ్మీర్‌ లోయలో పరిస్థితులను ఎలా సాధారణ స్థితికి తీసుకురావటం, రాజకీయ పరస్పర సహకారం ప్రధాన ఎజెండాలుగా భేటీలో గవర్నర్‌ వోహ్రా ప్రతిపాదన చేశారు. అయితే బలగాల మోహరింపు ద్వారానే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాని పార్టీలన్నీ గవర్నర్‌తో స్పష్టం చేశాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయటమే ఉత్తమమని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు గవర్నర్‌తో తేల్చి చెప్పాయి. ‘ఇప్పటికే అన్ని పార్టీలు తమకు మెజార్టీ లేదన్న విషయం చెప్పేశాయి. పైగా ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చాయి. ఇలాంటి సమయంలో ఇంకా అసెంబ్లీని కొనసాగించటం సబబు కాదు. ఇది గందరగోళాన్ని, రాజకీయ అస్థిరతను సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్‌ అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని కాంగ్రెస్‌ జమ్ము చీఫ్‌ గులాం అహ్మద్‌ మీర్‌ కోరారు. మరోవైపు ఎన్సీ అధినేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. 

పీడీపీ, బీజేపీలు మాత్రం... అయితే పీడీపీ మాత్రం కాంగ్రెస్‌, ఎన్సీల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పీడీపీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష భేటీకి హాజరుకాకపోవటంతో ఆమె తరపున ఆ పార్టీ కార్యదర్శి దిలావర్‌ మీర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ‘ఇది సున్నితమైన అంశం. గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉందనే అనుకుంటున్నాం. ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేయటం కన్నా కొనసాగించటమే మంచిది. ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370 (ప్రత్యేక హోదా అంశం)లపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు కథువా కేసు కూడా విచారణ దశలో ఉంది. ఇలాంటి స్థితిలో రాజకీయ గందరగోళం ఆయా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడ్డప్పుడే ఎన్నికలు కూడా నిర్వహించటం మంచిదని ముఫ్తీ భావిస్తున్నారు’  అని సమావేశం అనంతరం మీర్‌ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. ‘అమర్‌నాథ్‌ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రశాంత వాతావరణంలో యాత్ర కొనసాగేలా చూడాలి. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. ముందు ఆ ఎన్నికలు జరిగేలా చొరవ చూపాలి’ అని బీజేపీ నేత, మాజీ మంత్రి సత్‌ శర్మ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమావేశం అనంతరం​ బయటకు వచ్చిన నేతలు అసంతృప్తిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోవటం గమనార్హం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు