‘అది ఎప్పటికీ చనిపోదు.. దేశానికి ఎంతో అవసరముంది’

25 May, 2019 10:06 IST|Sakshi

లోక్‌సభ ఫలితాలపై రాజస్తాన్‌ సీఎం

జైపూర్‌: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ చనిపోదని, పార్టీ అవసరం దేశ ప్రజలకు ఎంతో ఉందని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌ అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఓటమిని ఎదుర్కొన చరిత్ర తమ పార్టీకి ఉందని.. గెలిచినా ఓడినా తామేప్పుడు ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. దీనిపై గెహ్లోట్‌ మాట్లాడుతూ..బీజేపీ దేశ ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుతోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో జాతీయవాదం, హిందుత్వ, సైనికులు త్యాగాలు, అబద్ధాలు వంటి అంశాలను బీజేపీ ఎక్కువగా ప్రచారం చేసిందని ఆరోపించారు.

మాజీ ‍ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1977 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఓటమి తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అద్భుత విజయాన్ని సాధించిందని, ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ అవసరం ఎంతో ఉందని గెహ్లోట్‌ స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం తమ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎంతో ప్రయత్నించారని, కానీ తాము చేసిన హామీలు ప్రజలకు చేరలేదని అభిప్రాయపడ్డారు. గతంలో మాదీరిగానే ఈసారి కూడా మోదీ అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. స్వతంత్ర భారత అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీ కృషి ఎంతో ఉందని, ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రనా జరిగిన నష్టమేమీ లేదన్నారు. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు