కేంద్రంపై కాంగ్రెస్‌ అవిశ్వాస నోటీసులు

24 Mar, 2018 01:16 IST|Sakshi

     స్పీకర్‌కు మల్లికార్జున ఖర్గే నోటీసులు..

     లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేత

     మంగళవారం బిజినెస్‌లో చేర్చాలని విన్నపం

     తమ సభ్యులకు విప్‌ జారీ చేసిన ప్రతిపక్ష పార్టీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో దేశ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన అవిశ్వాసం పోరులో తాజాగా కాంగ్రెస్‌ పార్టీ కూడా చేరింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వంపై నేరుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం లోక్‌సభ సెక్రటరీని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కలసి ఆ నోటీసులు అందజేశారు. మంగళవారం నాటి లోక్‌సభ బిజినెస్‌లో దీనిని చేర్చాలని కోరారు.

27వ తేదీన సభకు హాజరు కావాలని కాంగ్రెస్‌ పార్టీ తమ సభ్యులకు విప్‌ జారీ చేసింది. 48 మంది సభ్యులున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా అవిశ్వాసం నోటీసులివ్వడంతో లోక్‌సభలో ఆ తీర్మానానికి అనుకూలత పెరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పరమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి సభ ఆర్డర్‌లో లేదని చెబుతూ వాయిదా వేస్తున్న స్పీకర్‌.. మంగళవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఉత్కంఠ రేగుతోంది. కాగా, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ పార్టీల ఎంపీల అభ్యర్థనపై సోమవారం లోక్‌సభకు స్పీకర్‌ సెలవు ప్రకటించారు. అలాగే రాజ్యసభకు కూడా సోమవారం సెలవు ప్రకటించారు.

మరిన్ని వార్తలు