సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

3 Jun, 2019 04:46 IST|Sakshi

విపక్ష నేత హోదాపై చట్టంలో ఏముంది?

నిపుణులు ఏమంటున్నారు?

పదిహేడో లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి చర్చనీయాంశమయింది. విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులున్న కాంగ్రెస్‌ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి దక్కాలని కొందరు అంటోంటే, మొత్తం సీట్లలో కనీసం పది శాతం సీట్లు సాధించిన పార్టీకే ఆ పదవి దక్కుతుందని, కాంగ్రెస్‌కు పది శాతం సభ్యులు లేరు కాబట్టి ప్రతిపక్ష నేత పదవిని కోరే హక్కు లేదని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నేత పదవి అన్నది చట్టబద్ధమైన హోదా అని, పది శాతం నిబంధన చట్టంలో ఎక్కడా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శాతంతో సంబంధం లేకుండా లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్ష సభ్యునికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి తీరాలని వారు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా కోరే పార్టీకి లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులున్నారా లేదా అన్నదే స్పీకర్‌ చూడాలి కాని ఎంత మంది లేదా ఎంత శాతం అన్న లెక్క వేసే అధికారం స్పీకర్‌కు లేదని వివరిస్తున్నారు. బ్రిటన్‌ పార్లమెంటరీ వ్యవస్థలో అయితే విపక్ష నేతను ‘షాడో ప్రైమ్‌ మినిస్టర్‌’గా పేర్కొంటారు. ఒకవేళ అధికార పక్షం పార్లమెంటులో మెజారిటీ కోల్పోతే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ విపక్ష నేత సిద్ధంగా ఉంటారు. అందుకే విపక్ష నేతను షాడో ప్రధానమంత్రిగా పేర్కొంటారు.   

స్పీకర్‌దే తుది నిర్ణయం
మన పార్లమెంటరీ విధానంలో ఉభయ సభల్లోనూ విపక్ష నేత పదవి చట్టబద్ధమైనది. 1977 నాటి ‘పార్లమెంటులో విపక్ష నేతల జీత, భత్యాల చట్టం’ ఈ పదవిని నిర్వచించింది. లోక్‌సభ/రాజ్యసభలో ప్రతిపక్షాల్లో దేనికి ఎక్కువ మంది సభ్యులుంటే ఆ పార్టీ సభ్యుడు విపక్ష నేత అవుతారని, ఆ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్‌/రాజ్యసభ చైర్మన్‌ గుర్తించాలని ఆ చట్టం నిర్దేశించింది. ఎక్కువ మంది అని చెప్పిందే కాని ఎంత శాతం అన్నది చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రతిపక్షాల్లో ఒకటి కంటే ఎక్కువ పార్టీలకు సమాన సంఖ్యలో సభ్యులు ఉన్నట్టయితే, వాటిలో ఏదో ఒక పార్టీ సభ్యుడిని విపక్ష నేతగా స్పీకర్‌ గుర్తించవచ్చని, ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆ చట్టం స్పష్టం చేస్తోంది.

సభలో ఎక్కువ మంది సభ్యులున్న ప్రతిపక్షం తమ పార్టీ సభ్యుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయాలి. ఆ అభ్యర్థనను పరిశీలించిన స్పీకర్‌ ఆ పార్టీ పేర్కొన్న వ్యక్తికి విపక్ష నేతగా గుర్తింపు ఇస్తారు. సంఖ్యాపరంగా పెద్ద పార్టీకి విపక్ష నేత హోదా కోరే హక్కుందని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

ఏది పార్టీ... ఏది గ్రూప్‌
చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు విపక్ష నేత హోదా గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది. 1950 దశకంలో స్పీకరు పార్లమెంటులో ప్రతిపక్షాలను సభ్యుల సంఖ్య ఆధారంగా కొన్నింటిని పార్టీలుగా, కొన్నింటిని గ్రూపులుగా గుర్తించడం మొదలైంది. సభలో సీట్లు, చర్చల్లో సమయం, పార్టీ లకు గదులు కేటాయించడం కోసం అప్పట్లో ఈ పద్ధతిని అనుసరించారు. మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించిన రాజకీయ పక్షాన్ని పార్టీ అని, అంతకంటే తక్కువ శాతం సీట్లు ఉన్నదాన్ని గ్రూప్‌ అని వర్గీకరించారు. అప్పటి నుంచి పది శాతం అన్నది నిబంధనగా మారిపోయింది. 1977లో జీత భత్యాల చట్టం ఈ విషయంలో సందేహానికి, గందరగోళానికి తెరదించింది.

ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురున్నా...
రాజ్యాంగంలోని పదో షెడ్యూలు పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనలు తెచ్చింది. దాని ప్రకారం సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా సభలో ఉండే ప్రతి రాజకీయ పక్షాన్ని పార్టీగానే పరిగణిస్తున్నారు. ఒక సభ్యుడున్న పక్షాన్ని కూడా పార్టీగానే గుర్తిస్తున్నారు. ఢిల్లీ శాసనసభలో సభ్యులు 70 మంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి ముగ్గురే సభ్యులున్నారు. పదిశాతం నిబంధన ప్రకారం ఆ పార్టీకి విపక్షనేత హోదా రాకూడదు. అయితే, స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ బీజేపీకి ఆ గుర్తింపు ఇచ్చారు.  

మరిన్ని వార్తలు