ప్రణబ్‌ ముఖర్జీకి ఊహించని పరిణామం!

11 Jun, 2018 14:32 IST|Sakshi
ప్రణబ్‌ ముఖర్జీ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ఓ వైపు ప్రధాని పదవికి తాను అర్హుడినని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతో చిరకాల కోరికను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీర్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ మరోవైపు సొంత పార్టీ కాంగ్రెసే ఆయనకు షాకిచ్చినట్లు సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ ప్రణబ్‌ను ఆహ్వానించక పోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ కీలక ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌ ముఖర్జీతో పాటు ఆప్‌ కన్వినర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని అందుకు ఈ ఇఫ్తార్‌ ఈవెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరుకావడం కాంగ్రెస్‌ కూటమికి అంతగా రుచించడం లేదు. కాగా, తమకు అనుకూల పార్టీలకు ఇఫ్తార్‌ విందుకు ఆహ్వానాలు పంపిన కాంగ్రెస్‌.. ఆయా పార్టీల అధ్యక్షులు హాజరుకాని పక్షంలో ఇతర కీలక నేతలను పంపాలని కోరింది.

మరిన్ని వార్తలు