పీఏసీ చైర్మన్‌గా వనమా!

20 Jan, 2019 05:09 IST|Sakshi

సీనియర్‌ ఎమ్మెల్యే, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష పార్టీకి లభించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెం దిన సీనియర్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వనమా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత ఎక్కువ సార్లు గెలుపొందిన ముగ్గు రు ఎమ్మెల్యేల్లో సీనియర్‌ ఈయన.

సీఎల్పీ నేతగా ఎస్సీ నాయకుడిని ఎంపిక చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన ఉత్తమ్‌ ఉండటంతో పీఏసీ చైర్మన్‌ పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తారని, ఆ కోటాలో బీసీల్లో సీనియర్‌ ఎమ్మెల్యే అయి న వనమాను ఈ పదవికి ఎంపిక చేస్తారని టీపీసీ సీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వా త కాంగ్రెస్‌ తరఫున ఎక్కువ సార్లు గెలిచిన సీని యర్‌ ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. దీనిలో భాగంగా నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన పి.కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమిం చింది.

అప్పటికే ఐదుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ ఈయన కంటే 13 ఏళ్ల ముందు ఎమ్మెల్యే అయిన కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత కిష్టారెడ్డి చనిపోవడంతో రాంరెడ్డి వెంకటరెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమిం చారు. వెంకటరెడ్డి కూడా అదే టర్మ్‌లో చనిపోవడంతో 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్‌ అయిన జె.గీతను ఆ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఐదుసార్లు గెలిచిన ఉత్తమ్‌ని ఈసారి పీఏసీ చైర్మన్‌ పదవికి ఎంపిక చేయాల్సి ఉం టుంది.

ఉత్తమ్‌ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాది. దీంతో ఈసారి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో సీనియర్లకు అవకాశం వచ్చింది. వీరిలో 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో వనమా, సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. సబితా, శ్రీధర్‌బాబు పీఏసీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. వీరి కంటే సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో వనమాను పీఏసీ చైర్మన్‌గా నియమించే అవకాశముందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

ఉపనేతగా రాజ్‌గోపాల్‌రెడ్డి..
సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ను పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అసెం బ్లీలోని ఇతర పదవులపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఉపనేతలుగా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఉపనేత పదవి ఖరారైనట్టు తెలుస్తోం ది. ఆయనతో పాటు ఎస్టీ మహిళా కోటాలో సీతక్క, సీనియర్‌ ఎమ్మెల్యేగా సబిత, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ కార్యదర్శి, విప్‌ పదవులకు పార్టీ తరఫున పొడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, జగ్గారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో పాటు హరిప్రియా నాయక్‌ పేరు కూడా వినిపిస్తోంది.  

మరిన్ని వార్తలు