ఫోకస్‌ @ 120

11 Apr, 2019 08:20 IST|Sakshi

కాంగ్రెస్, బీజేపీ ఆశలు ఆ సీట్లపైనే..

పట్టు బిగించేందుకు ఎత్తులు పై ఎత్తులు

ఈ ఎన్నికలతో కేంద్రంలో పాగా వేయాలని కాంగ్రెస్, మరోసారి అధికార పీఠాన్ని అధిష్టించాలని బీజేపీ శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. అం దులో భాగంగా 2014 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన లేదా రెండో స్థానంలో వచ్చిన నియోజకవర్గాలపై రెండు పార్టీలు దృష్టి సారించా యి. రెండు పార్టీలకు ఇలాంటి నియోజకవర్గాలు 120 వరకు ఉన్నాయి. వీటిలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకుని తమ విజయానికి మార్గం సుగమం చేసుకోవాలన్న ఆశతో ఇవి ఉన్నాయి.

‘వికాసం’ కోసం పర్యవేక్షకులు
ఈసారి ఎన్నికల్లో గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను నిలబెట్టుకోవడం సులభం కాదని గుర్తించిన కమలనాథులు..ఈ 120 సీట్లపై శ్రద్ధ పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లే గెలుచుకోగలిగింది. 2017లో 95 రోజు ల పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ 120 స్థానాల  పరిస్థితిని ఆకళింపు చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కేంద్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు అప్పగించారు. వారికి సహకరించడానికి 3 వేలకు పైగా పార్ట్‌టైం కార్యకర్తలను కూడా నియమించారు. ఒక్కో మంత్రికి, ఒక్కో ప్రధాన కార్యదర్శికి ఐదారు నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. వీరితో పా టు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరో 600 మంది ఫుల్‌టైమ్‌ కార్యకర్తలను కూడా నియమించా రు. ఈ 600 మందిలో 543 మందిని నియోజకవర్గానికి ఒకరిని చొప్పున నియమించారు. మిగతా వారిని పార్టీ పనితీరు బాగాలేని చోట్ల ఐదారు సీట్లకు కలిపి ఒకరిని పర్యవేక్షకుడిగా నియమించారు.

‘చే’జారిపోకుండా కాంగ్రెస్‌ కసరత్తు
కాంగ్రెస్‌ కూడా గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్రలో 120 స్థానాలపై దృష్టి పెట్టింది.గత ఎన్నికల్లో ఈ 120 సీట్లలో మెజారిటీ సీట్లను బీజేపీనే దక్కించుకుంది. ఈసారి గత ఎన్నికల్లో గెలిచిన సీట్లతో పాటు బీజేపీ నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు లాక్కోవాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అందుకోసం బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగల వారినే ఇక్కడ నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికల తర్వాత ఏర్పడే కూటమిలో తన మాట నెగ్గాలంటే గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకోక తప్పదన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ గుర్తించింది. మొత్తం మీద తమ జాతకాలను మార్చగల ఆ 120 సీట్లను దక్కించుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు