ఇంకా తేరుకోని కూటమి

15 Dec, 2018 02:24 IST|Sakshi

ఓటమిపై సమీక్ష నిర్వహించని వైనం

కనీసం పలకరించుకోని భాగస్వామ్యపక్షాల నేతలు

త్వరలో జరిగే వరుస ఎన్నికల్లో కూటమిగా పోటీపై మీమాంస

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజా ఫ్రంట్‌ కూటమి తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. ఫలితాలు వెలువడి మూడు రోజులు దాటినా ఇంకా వాటిని సమీక్షించే సాహసం కూడా చేయడం లేదు. ఇంతవరకు కూటమి భాగస్వామ్యపక్షాల ముఖ్యనేతలు కనీసం పలకరించుకున్న దాఖలాలూ లేవు. టీడీపీతో కుదుర్చుకున్న పొత్తే ఆత్మహత్యా సదృశం గా మారడంతో ఓటమికి కారణాల విశ్లేషణే ముం దుకు కదలడం లేదు. టీడీపీతో పొత్తు కారణంగా ప్రస్తుతం రాజకీయంగా తలెత్తిన విపత్కర పరిస్థితులపై అంతర్మథనం కొనసాగుతోంది.

ఫలితాల సరళి, తీరుపై సమీక్షకు రాష్ట్ర టీడీపీ నాయకులను పిలిపిం చాలంటేనే భాగస్వామ్యపక్షాలు జంకుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలతో సమావేశానికి చొరవ తీసుకోకపోవడంతో కనీసం సీపీఐ, టీజేఎస్‌ నేతలు కలుసుకుని ప్రాథమిక సమీక్ష జరపాలని భావించినా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కానట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో వరుసగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కూటమిగా కొనసాగాలా లేక విడివిడిగా పోటీచేస్తేనే మంచిదా అనే మీమాంసలో కూటమి నేతలున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతపై అతిగా అంచనాలు...
ప్రజల మనోభావాలకు భిన్నంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం, కూటమి ఎన్నికల ప్రచార సంధానకర్తగా చంద్రబాబుకు పూర్తి బాధ్యతలు అప్పగించడం కూటమి ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేల విడిచి సాము చేస్తున్న చంద్రబాబు, తెలంగాణలో ఎలాంటి గుణాత్మక మార్పు తేగలుగుతారన్న దాని పై కూటమి నేతలు సరిగా అంచనా వేయలేకపోవడం ప్రతికూలంగా మారిందని అంటున్నారు. అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ ధోరణితో ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ముఖ చిత్రంగా మార్చేయడం కూటమిని దెబ్బతీసిందనే అభిప్రాయంతో పలువురు నాయకులున్నారు. దీంతోపాటు టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత పతాకస్థాయికి చేరాయన్న అతిఅంచనాలు కూటమి అవకాశాలను దెబ్బతీశాయని భావిస్తున్నా రు.

క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో కూటమి విఫలం కావడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమిగా ఏర్పడగానే ఇక అధికారానికి వచ్చేసినట్లేననే అతివిశ్వాసం ప్రతికూలంగా మారిం దన్న అంచనాల్లో ఆయా పార్టీల నాయకులున్నారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కారణంగానే టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందనే ప్రాథమిక అంచనాపైనే కూటమి రాజకీయ వ్యూహా న్ని ఖరారు చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు. ప్రజలు, గ్రామీణుల మనోభావాలకు భిన్నంగా పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు, నిరుద్యో గ యువత భావాలు, అభిప్రాయాలనే కూటమి నేత లు ప్రామాణికంగా తీసుకోవడం కూడా దెబ్బతీసిందంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అందుతున్న ప్రయోజ నాలపట్ల ఎలాంటి అభిప్రాయం, వైఖరితో ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కూడా భారీ ఓటమికి కారణమైందనే అభిప్రాయం ప్రజాఫ్రంట్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు