చేవెళ్ల రుణం తీర్చుకుంటాం

27 Feb, 2018 08:53 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, హాజరైన జనం

ఈ ప్రాంతాన్ని కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యం చేసింది

గోదావరి జలాలను చేవెళ్లకు తీసుకొస్తాం

ఉమ్మడి జిల్లాలో హరితసిరులు పండిస్తాం

ఐటీఐఆర్‌కు నిధులు రాబట్టలేని అసమర్థ మంత్రి కేటీఆర్‌

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజాచైతన్య బస్సుయాత్ర ప్రారంభం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో అధికారం కట్టబెడితే చేవెళ్ల రుణం తీర్చుకుంటామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి అచ్చొచ్చే ఈ ప్రాంతాన్ని కేసీఆర్‌ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. సోమవారం చేవెళ్లలో కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన ఉత్తమ్‌.. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. బీడు భూము లను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీడిజైన్‌ పేరుతో రైతుల నోట్లో మట్టికొట్టిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గోదావరి జలాలను చేవెళ్లకు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హరితసిరులు పండిస్తామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను అమలు చేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టలేని అసమర్థ మంత్రి కేటీఆర్‌ అని ధ్వజమెత్తారు. సూటు, బూటు తప్ప పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చే సత్తా ఆయనకు లేదని విమర్శించారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి చూపే ఐటీఐఆర్‌ను పట్టించుకోకుండా రైతాంగాన్ని వీధిన పడేసే ఫార్మాసిటీపై దృష్టిపెట్టడం దురదృష్టకరమన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, ఈ ప్రాంతం ప్రజలకు గొడ్డలిపెట్టుగా మారిన 111 జీఓను పునఃసమీక్షిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బకాయిలను కూడా చెల్లించే బాధ్యత తమదేనని ఆయన చెప్పారు.

కొత్త జోష్‌..
‘ప్రజా చైతన్య బస్సు యాత్ర’ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ నింపింది. కేసీఆర్‌ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు చేపట్టిన తొలి రోజు యాత్ర ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. 2004, 2009 ఎన్నికల్లో గెలుపుబాట వేసిన చేవెళ్ల సెంటిమెంట్‌గా అదే గడ్డ నుంచి ప్రారంభమైన యాత్రకు భారీ స్పందన లభించింది. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి పార్టీ అగ్రనాయకత్వం తరలిరావడంతో కేడర్‌లో నూతనోత్తేజం నెలకొంది. సీనియర్ల ‘ఐ’క్యతారాగం కూడా సభ విజయవంతానికి దోహదం చేసింది. ముఖ్యనేతలంతా భారీగా జనసమీకరణ జరపడంతో సభాస్థలి నిండిపోయింది. మాజీ ఎంపీ, క్రికెటర్‌ అజారుద్దీన్, షబ్బీర్, వీహెచ్, రేవంత్‌రెడ్డి సంధించిన వాగ్భాణాలకు కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను సున్నితంగా విమర్శిస్తూ సాగిన ప్రసంగం అలరించింది. మరోవైపు ఈ యాత్రను చేవెళ్లనే ఎందుకు ఎంచుకున్నామనే అంశంపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు దివంగత సీఎం వైఎస్సార్‌ పేరును ప్రస్తావించడంతో కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తమైంది.

మరిన్ని వార్తలు