ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ‘సై’

24 Feb, 2019 04:36 IST|Sakshi
భట్టి చాంబర్‌లో గండ్ర, శ్రీధర్‌ బాబు

కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్‌ నేతలు 

రేసులో షబ్బీర్, శశిధర్‌రెడ్డి, పొంగులేటి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వచ్చింది. తమ 19 మంది సభ్యులతో పాటు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి ఒక ఎమ్మెల్సీ స్థానం గెలిచే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో నూ బరిలో ఉండాల్సిందేనని టీపీసీసీ ముఖ్య నేతలు నిర్ణయించారు. దీని విషయమై శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చాంబర్‌లో ముఖ్య నేతలు సమావేశమై చర్చించారు. టీఆర్‌ఎస్‌ నలుగురు అభ్యర్థులను ప్రకటించి, ఒక స్థానాన్ని ఎంఐఎంకు ఇస్తున్నట్టు ప్రకటించడంతో తాము కూడా బరిలో ఉంటే ఎన్నిక అనివార్యమవుతుందని, ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని నేతలు నిర్ణయించారు.  

సంతకాల సేకరణ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ప్రతిపాదన కోసం అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల సంతకాలను కూడా కాంగ్రెస్‌ సేకరించినట్టు సమాచారం.ఇందులో 8 మంది కాంగ్రెస్‌ సభ్యులతో పాటు ఇద్దరు టీడీపీ సభ్యుల సంతకాలున్నాయని తెలుస్తోంది. శనివారం అసెంబ్లీ ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు భట్టి చాంబర్‌లోకి వెళ్లారు. అక్కడే ఉన్న ఉత్తమ్, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలతో కొద్దిసేపు చర్చించారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాల సేకరణతో కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో ఉండటం ఖాయమేనని ఆ పార్టీ వర్గాలంటున్నాయి.  

బరిలో ఎవరు..? 
పోటీ ఖాయం కావడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన అమరావతికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసివచ్చింది కూడా ఇందుకేననే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ ముగ్గురితో పాటు పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.అభ్యర్థిత్వం ఖరా రు కోసం ఈనెల 26న జరిగే ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ ఉంటుందని తెలుస్తోంది.ఈ సమావేశంలో చర్చించిన అనంతరం నేతల పేర్లను అధిష్టానానికి తెలియజేసి అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చిన తర్వాత 27 లేదా 28న తమ అభ్యర్థి చేత నామినేషన్‌ వేయించాలనే ఆలోచనలో పార్టీ ఉంది.

మరిన్ని వార్తలు