ఆ నియోజకవర్గాల్లో ఆపసోపాలు..?

14 Jan, 2020 03:02 IST|Sakshi

ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు 

పార్టీ మారిన చోట్ల కాంగ్రెస్‌లో కుదరని సమన్వయం

దాదాపు 25 నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై గందరగోళం

నామినేషన్లు వేసినా గెలుపు బాధ్యత తీసుకునే వారు కరువు  

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామని కాంగ్రెస్‌ నేతలు గంభీరం వ్యక్తం చేస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిన అభ్యర్థులు టీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లోకి వెళ్లిన చోట్ల, గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపడమే గగనంగా మారింది. అష్టకష్టాలకోర్చి ఎలాగో అలా అభ్యర్థులను నిలబెట్టినా వారిలో ఎంతమంది బరిలో ఉంటారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ద్వితీయ శ్రేణి నేతలతోపాటు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు నెరవేర్చినా క్షేత్రస్థాయిలో సమన్వయం కుదరక ఎన్నికల నావ తీరానికి చేరుతుందో లేదో.. చేరినా ఏ దరికి చేరుతుందో అనే ఆందోళన ఆయా మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది.

ఉపసంహరణల భయం.. 
ఎమ్మెల్యేలు పార్టీలు మారిన మహేశ్వరం, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పినపాక, నకిరేకల్, ఎల్బీనగర్, ఇల్లెందు, ఎల్లారెడ్డి, కొల్లాపూర్, పాలేరు, తాండూరు నియోజకవర్గాలతోపాటు ఎన్నికల తర్వాత నేతలు పార్టీ వీడి వెళ్లిపోయిన నర్సాపూర్, షాద్‌నగర్, దేవరకద్ర, ఆలేరు, హుస్నాబాద్, చేవెళ్ల, వైరా, మానకొండూరు, మెదక్, రాజేంద్రనగర్, సత్తుపల్లి, వర్ధన్నపేట తదితర 25 నియోజకవర్గాల్లో చాలాచోట్ల తాత్కాలిక ఇన్‌చార్జులతోనే పార్టీ వ్యవహారాలను నెట్టుకొస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ శివారు, నల్లగొండ జిల్లాల్లో కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తున్నా మిగిలిన చోట్ల అభ్యర్థులను బరిలో దింపేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పార్టీ బీఫారం ఇస్తాం.. పోటీ చేయండంటూ పట్టుకొచ్చి మరీ నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది.

అయితే మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అనే భయం టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలాచోట్ల టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తుండటంతో అప్పుడే క్యాంపులకు పంపాల్సి వస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఈ మున్సిపాలిటీల్లో ప్రచారం కూడా నామమాత్రంగానే సాగుతోంది. ఇక్కడ గెలుపు బాధ్యతలు ఎవరు తీసుకోవాలన్న దానిపై కూడా కాంగ్రెస్‌లో స్పష్టత లేకుండా పోయింది. అయితే కొత్త, పాత టీఆర్‌ఎస్‌ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో రెబల్స్‌గా బరిలో ఉన్న వారిని లాక్కునే ప్రయత్నాలు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్నా ఏ మేరకు అవి సఫలీకృతం అవుతాయన్నది వేచిచూడాల్సిందే.
 

>
మరిన్ని వార్తలు