ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’

24 May, 2020 04:04 IST|Sakshi

జూన్‌ 2న కృష్ణా పెండింగ్‌ ప్రాజెక్టులు, 6న గోదావరి ప్రాజెక్టుల వద్ద దీక్షలు

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి నాలుగు కమిటీల ఏర్పాటు

నేడు ఓయూకు టీపీసీసీ బృందం..ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం

జూన్‌ 3, 4 తేదీల్లో నూతన వ్యవసాయ విధానంపై రైతులతో సంప్రదింపులు

వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దంటున్న కలెక్టర్లపై కోర్టుకెళ్తాం: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్‌ 2న కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద, జూన్‌ 6న గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు.

జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా కృష్ణానదిపై ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తూ దీక్షలు చేయనున్నారు. అందులో భాగంగా శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేయనున్నారు. పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, లక్ష్మీదేవిపల్లి పంపుహౌస్‌ దగ్గర మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లూరు జలాశయం దగ్గర మాజీ మంత్రి నాగం, కరివేన ప్రాజెక్టు దగ్గర మాజీ మంత్రి చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల దగ్గర ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 6న గోదావరి నదిపై ఉన్న పెం డింగ్‌ ప్రాజెక్టులకు నిరసనగా ఇదే తరహాలో దీక్షలు చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న అంశంపై చర్చించిన టీపీసీసీ నేతలు ఆదివారం ఉస్మానియాకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పా టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటు న్న నూతన వ్యవసాయ విధానంపై జూన్‌ 3, 4 తేదీల్లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు రైతులతో సంప్రదించాలని నిర్ణయించారు.

చెప్పడానికి వారెవరు: ఉత్తమ్‌ 
సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది తుగ్లక్‌ చర్య అని, నూతన వ్యవసాయ విధానం పేరుతో ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదనలను రైతులు అంగీకరించరని చెప్పారు. నూతన వ్యవసాయ విధానంపై రైతులతో సంప్రదిస్తామని, వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొన్నిచోట్ల వరి, మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దని కలెక్టర్లు చెబుతున్నారని, ఫలానా విత్తనాలు అమ్మవద్దని చెప్పేందుకు కలెక్టర్లు ఎవరని ప్రశ్నించారు. కలెక్టర్ల తీరుపై కోర్టుకు వెళ్తామని ఉత్తమ్‌ చెప్పారు. ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.  

శనివారం గాంధీ భవన్‌లో సమావేశమైన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహా

మరిన్ని వార్తలు