కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి

5 May, 2020 02:33 IST|Sakshi
గవర్నర్‌ తమిళిసైకు వినతి పత్రం అందిస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌ రెడ్డి

ప్రభుత్వం కరోనా టెస్టులు ఎందుకు తగ్గించిందో వివరణ ఇవ్వాలి

కరోనా కట్టడి చర్యల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు కాంగ్రెస్‌ వినతి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దృష్టికి తీసుకెళ్లింది. కరోనా పరీక్షలను పూర్తిగా తగ్గించారని, దీనికి గత సహేతుక కారణాలను వెల్లడించడం లేదని వివరించింది. పరీక్షలకు అవసరమైన అన్ని సదుపాయాలున్నా వాటిని ఎందుకు వినియోగించుకోవడం లేదో ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని విన్నవించింది. కరోనాపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు కరోనా సోకాలని సీఎం కేసీఆర్‌ శాపాలు పెడుతున్నారని గవర్నర్‌ దృష్టికి తెచ్చింది.

ఈ మేరకు టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వైద్యులకు సదుపాయాల కల్పన, ధాన్యం సేకరణ, వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఈ అంశాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంలో నాణ్యత లేదని, ధాన్యం కొనుగోళ్లలో వాడుతున్న పాత గోనె సంచులు ఫొటోలు, ధాన్యం కేంద్రాలు వసతుల లేమి అంశాలను ఫొటోలతో సహా చూపించారు.

సన్నబియ్యం ఇవ్వాలి: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలకు నెలకు రూ.5 వేలు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి  అన్ని రాజకీయపక్షాలతో మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. ఐసీఎమ్‌ఆర్‌ మార్గదర్శకాల ప్రకారం రోజుకు ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు చూపెట్టడం లేదని, మరణాలపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేవని ఆరోపించారు.

చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎంతమంది వలస కూలీలున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని, వలస కూలీలు వెళ్ళి పోతే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని, ఈ దృష్ట్యా వలస కూలీలకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. నరేగాలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల ను బేషరుతుగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు