రీషెడ్యూల్‌ చేయండి..సాధ్యం కాదు..

29 Dec, 2019 01:28 IST|Sakshi
శనివారం జరిగిన ఎస్‌ఈసీ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి. నాగిరెడ్డి

వాడివేడిగా ఎస్‌ఈసీ సమావేశం

ఎన్నికల తేదీలు రీషెడ్యూల్‌ చేయాలన్న కాంగ్రెస్, ఇతర పక్షాలు

సాధ్యం కాదన్న కమిషన్‌.. వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌

ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్నారని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలంటూ తాము చేసిన విజ్ఞప్తిపై ఎస్‌ఈసీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు పేర్కొన్నారు. తాము ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోకపోగా ఎస్‌ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోపిశెట్టి నిరంజన్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అఖిలపక్ష సమావేశంలో ఆయన ఉపయోగించిన పరుష పదజాలానికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజరేషన్లు ప్రకటించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరితే తనపై దాడి చేశారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు ఎన్నికల తేదీలు రీ షెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సమావేశం ఒకింత రసాభాసగా మారింది. తమతో పరుషంగా మాట్లాడిన కృష్ణ స్వరూప్‌ను పోలీసుల సహాయంతో బయటకు పంపించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

శనివారం ఎస్‌ఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలు, రాజకీయపక్షాలతో కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వి.నాగిరెడ్డి ముందుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, షెడ్యూల్‌ విడుదల గురించి వివరించారు. మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు నిర్వహించొచ్చని మున్సిపల్‌ చట్టంలో ఉందని, ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో తామే కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మెజారిటీ మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసి 7 నెలలు గడిచినందున, సమ్మక్క,సారక్క జాతర ను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 25లోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నాగిరెడ్డి చెప్పారు.

ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటుంటే తనను  విమర్శిస్తున్నారని, కొందరు చెత్త, చెత్తగా మాట్లాడుతున్నారని, తన వద్ద పోలీసులు లేరని, ఉంటే వారిని పోలీస్‌స్టేషన్‌కు పంపేవాడినంటూ వ్యాఖ్యానించారు. కమిషనర్‌ హోదాలో ఉండి అలా వ్యాఖ్యానించడం ఆయన ఔన్నత్యానికి సరికాదని కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండుగ తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వాలని, సాయంత్రం 6 తర్వాత ప్రచారానికి అనుమతించేలా నిబంధనలు సడలించాలని కోరారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ హాజరయ్యారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత డీజీ నరసింహారావు డిమాండ్‌ చేశారు. ఎన్నికలు వాయిదా వేయించేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోందని టీఆర్‌ఎస్‌ ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను అనుకున్న తేదీల్లో నిర్వహించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ కోరారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు లేకుండా షెడ్యూల్‌ విడుదల చేయడం సరికాదని బీజేపీ నేత జి.మనోహర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.

వాయిదా వేయలేం... 
ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సి పల్‌ ఎన్నికలుంటాయని, వాటిని వాయిదా వేయలేమని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 30 నాటికి ఓటర్ల జాబితా వెలువడుతుందని, వచ్చే నెల 6వ తేదీకల్లా రిజర్వేషన్లు ఇస్తే 7న నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే నోటిఫికేషన్‌ జారీ చేయలేమని తెలిపారు. కార్యక్రమంలో విశ్వేశ్వరరావు (టీజేఎస్‌), బాలమల్లేశ్‌ (సీపీఐ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), నాగరాజు (తెలంగాణ లోక్‌సత్తా) ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది.. 
తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారీతిన, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఇష్ట ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామని, అధికార పార్టీకి వత్తాసు పలికేలా నాగిరెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని నిరంజన్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు