‘ఫార్మా సీటీ వద్దు.. ఐటీఐఆర్‌ ముద్దు’

3 May, 2018 18:01 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న సబితా ఇంద్రా రెడ్డి, జీవన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: యూపీఏ అధికారంలో ఉండగా మంజూరైన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ప్రాజెక్టు ఏర్పాటు జాప్యానికి పూర్తి బాధ్యత టీఆర్‌ఎస్‌దేనని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ‘ఫార్మా సిటీ వద్దు.. ఐటీఐఆర్‌ ముద్దు’ అనే నినాదంతో గురువారం ఇందిరాభవన్‌లో రంగారెడ్డి డీసీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విషం చిమ్మే ఫార్మా కంపెనీలపై మోజు పెంచుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్‌పై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

లక్షల మందికి ఉపాధే లక్ష్యంగా నాడు కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేస్తే అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌లు పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్‌ సీఎల్పీ ఉప నేత జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి ఏపాటిదో ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తేటతెల్లమవుతోందని అన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుపై మెతక వైఖరి అవలంభిస్తున్న సీఎం కేసీఆర్‌ తన ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇప్పటివరకు కేవలం 18 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రాజెక్టుగా వెలుగొందే అవకాశమున్న ఐటీఐఆర్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని కేసీఆర్‌కు సూచించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ చేపడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాని డిజైన్‌ మార్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేసిందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కాగా, ఐటీఐఆర్‌ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని జీవన్‌ రెడ్డికి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం, కిసాన్‌ సెల్‌ ఛైర్మన్‌ కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు