కాంగ్రెస్‌లో ఎన్నికల టీం

24 Apr, 2018 01:37 IST|Sakshi

త్వరలోనే ప్రచార, కో ఆర్డినేషన్, మేనిఫెస్టో కమిటీల ఏర్పాటు

రేసులో జైపాల్, మధుయాష్కి.. రాజనర్సింహ నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌లో త్వరలోనే ఎన్నికల టీం రెడీ కానుంది. ఒడిశాలో ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణలోనూ పార్టీ కమిటీల నియామకానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, ప్రచార, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, కోర్‌ కమిటీలను వచ్చే నెలలో ప్రకటించే దిశగా ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ యోచిస్తున్నారని సమాచారం. సామాజిక సమతుల్యత ఆధారంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారని, ఎస్సీ, బీసీ నాయకులకు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆశావహుల జాబితా చాంతాడంత 
పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్‌లో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికల టీంను నియమించేందుకు కసరత్తు చేస్తుండడంతో ఈ పోటీ మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే ప్రచార, మేనిఫెస్టో, కో ఆర్డినేషన్, కోర్‌ కమిటీల పగ్గాల కోసం, ఆ కమిటీల్లో స్థానం కోసం టీపీసీసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతుండగా.. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లను ఈ కమిటీలతో పాటు ప్రకటించనున్నారు. ఈ నెల19న విడుదల చేసిన ఒడిశా కమిటీలతోపాటు ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లను నియమించారు.

అదే తరహాలో రాష్ట్రంలోనూ ముగ్గురికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి ఈ హోదాలో ఉండగా.. కొత్తగా నియమించే ఇద్దరిలో ఒకరిని ఓసీ, మరొకరిని బీసీ వర్గం నుంచి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని ఎప్పట్నుంచో అంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌కు కూడా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ ఆలోచిస్తోంది. 

యాష్కికి కీలక బాధ్యతలు 
ఏఐసీసీలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో రాహుల్‌ ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న యాష్కికి ఈసారి పదోన్నతి వస్తుందని పీసీసీ వర్గాలంటున్నాయి. ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌ నేతలకు ఇచ్చే ఈ హోదాను ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట వేశామనే సంకేతాలు పంపాలన్నది రాహుల్‌ యోచనగా కనిపిస్తోంది. యాష్కికి పదోన్నతి రాకపోతే ఆయన్ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఒకవేళ పదోన్నతి వస్తే ప్రచార కమిటీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్‌ నేతకు అప్పగించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డికి చోటు ఖాయమని తెలుస్తోంది. సీడబ్ల్యూసీలో జైపాల్‌కు చోటివ్వకపోతే రాష్ట్ర పార్టీ సలహాదారుగా లేదా పార్టీ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది.  

మేనిఫెస్టో కమిటీకి రాజనర్సింహ 
ఇతర కమిటీల విషయానికి వస్తే.. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధా న్యం పెంచాలనే కోణంలో హైకమాండ్‌ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈయన నేతృత్వంలో ఉండే ఈ కమిటీకి కన్వీనర్‌గా ఓసీ సామా జిక వర్గ నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కో ఆర్డినేషన్‌ కమిటీలో పార్టీ సీనియర్‌ నేతలందరికీ స్థానం కల్పించనున్నారు. కోర్‌కమిటీలో సభ్యుల సంఖ్య తక్కువే అయినా.. చైర్మన్, కన్వీనర్లుగా ఓసీ, బీసీ నేతలను ఎంపిక చేయనున్నా రని టీపీసీసీ వర్గాలంటున్నాయి.  టీపీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ కమిటీల ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చ జరిగినా.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఆక్రోశ్‌ర్యాలీకి వెళ్లే సందర్భంగా టీపీసీసీ ముఖ్యులతో కమిటీల ఏర్పాటుపై రాహుల్, గెహ్లాట్‌ చర్చలు జరపనున్నారు.  

మరిన్ని వార్తలు