-

65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

13 Nov, 2018 00:19 IST|Sakshi

రాత్రి 11.15కి అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ

సాక్షి, న్యూఢిల్లీ: నెలన్నరపాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 65 మంది పేర్లతో సోమవారం రాత్రి 11.15 గంటలకు జాబితా ప్రకటించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు పోను కాంగ్రెస్‌ పోటీ చేసే 93 స్థానాల్లో 74 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 8న అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, ఆ జాబితా వెల్లడి కాకుండానే వాటిపై అనేక ఫిర్యాదులు అందడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ స్వయంగా జోక్యం చేసుకుని సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసన్‌లతో రాహుల్‌ రెండు విడతలుగా సమావేశమయ్యారు.

మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు, 3 నుంచి 4 గంటల వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవలే పార్టీలో చేరి అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్నవారు, నేతల ఒత్తిళ్లతో అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, సామాజిక సమతుల్యం లేనప్పటికీ అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థిత్వాలు పొందినవారు తదితర వివాదాస్పద అంశాలపై దాదాపు 20 స్థానాల్లో పునఃపరిశీలన జరిపారు. కొన్ని మార్పులు, చేర్పులు చేయించారు. అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ రాహుల్‌ సూచనల మేరకు వార్‌రూమ్‌లో సమావేశమై తుదిజాబితా రూపొందించింది. ఈ జాబితాపై సోనియాగాంధీ నివాసంలో రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి చర్చించింది. మార్పులు, చేర్పులు ఉన్న స్థానాలపై మాత్రమే చర్చించి ఆమోదించింది. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు కలసి ఏఐసీసీ కార్యాలయంలో జాబితాను క్రోఢీకరించారు.

పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ముకుల్‌ వాస్నిక్‌ రాత్రి 10.30 గంటలకు ఏఐసీసీకి చేరుకుని దానిని పరిశీలించి అధ్యక్షుడి ఆమోదానికి పంపి చివరకు 65 మందితో కూడిన జాబితాను రాత్రి 11.15 గంటలకు విడుదల చేశారు. తొలుత అనుకున్న 74 స్థానాల్లో 9 స్థానాలు నిలిపివేశారు. మరికొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకే తొలి జాబితాలో చోటు ఇచ్చారు. సిట్టింగ్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే, మరికొన్ని ముఖ్యమైన స్థానాలను కూడా  పెండింగ్‌లో పెట్టారు. సనత్‌నగర్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థిత్వాలను ఆశించినప్పటికీ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. మిత్రపక్షాలు కోరుతుండటంతో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రాని మేడ్చల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌ తదితర స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.  

రాష్ట్రనేతల తీరుపై రాహుల్‌ అసహనం!
ప్రజాకూటమిలోని మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాకపోవడంతో రాహుల్‌ ఈ విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర నేతల తీరుపై రాహుల్‌ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ మిత్రపక్షాలకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టత లేకపోవడంపై ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. మరోవైపు ఎన్నికలు సమీపించిన వేళ అకస్మాత్తుగా పార్టీలోకి వచ్చి అభ్యర్థిత్వాల తుది జాబితాలో చోటు చేసుకున్నారన్న ఫిర్యాదులను ఆయన లోతుగా చర్చించినట్టు సమాచారం. నకిరేకల్‌ లేదా మునుగోడు స్థానం తెలంగాణ ఇంటి పార్టీకి దక్కనుందన్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదులు అందాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట, పాలేరు, తుంగతుర్తి, ఇల్లెందు తదితర స్థానాల్లో కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి.

బీసీలకు న్యాయం జరగలేదని, పారాచూట్‌లా వచ్చి ఊడిపడ్డవారికి టికెట్లు ఇస్తున్నారని గాంధీభవన్‌ వద్ద, ఢిల్లీలో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఆయా సీట్లపై మరోసారి చర్చించారు. ఆయా స్థానాల్లో కొన్నింటిని మార్చాల్సిందిగా నేతలకు సూచించినట్టు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కొన్ని మార్గదర్శకాలు చేసి సామాజిక సమీకరణాలు, యువత, ప్రజలకు దగ్గరగా ఉండే నేతలను జాబితాలో చేర్చాలని ఆదేశించినట్టు తెలిసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లు ఎక్కువగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తలు వహించి ఎలాంటి వివాదాలకు వీలులేకుండా జాబితాను రూపొందించాలని రాహుల్‌ సూచించినట్టు తెలిసింది. తొలి జాబితాను ఇక ఎంతమాత్రం ఆలస్యం లేకుండా వెల్లడించాలని ఆదేశించినట్టు సమాచారం. అందుకే హైదరాబాద్‌లో విడుదల కావాల్సిన జాబితాను ఢిల్లీలోనే విడుదల చేశారు.

ఒకటి రెండు రోజుల్లో రెండో జాబితా  
స్క్రీనింగ్‌ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మొత్తం 93 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం 65 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వచ్చిన అనంతరం 28 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు రెబల్స్‌ బెడదను తట్టుకునేందుకు, వలసలను నివారించేందుకు వ్యూహాత్మకంగా రెండో జాబితాను ఆలస్యంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.   

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..
1. సిర్పూర్‌    – డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు  
2. చెన్నూరు(ఎస్సీ)    – డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట
3. మంచిర్యాల     – కె.ప్రేమ్‌సాగర్‌రావు
4. ఆసిఫాబాద్‌(ఎస్టీ)    – అత్రం సక్కు
5. ఆదిలాబాద్‌    – సుజాత గండ్రాత్‌
6. నిర్మల్‌    – ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
7. ముథోల్‌    – రామారావ్‌ పటేల్‌ పవార్‌
8. ఆర్మూర్‌    – ఆకుల లలిత
9. బోధన్‌    – పి.సుదర్శన్‌రెడ్డి
10. జుక్కల్‌ (ఎస్సీ)    – ఎస్‌.గంగారాం
11. బాన్సువాడ    – కాసుల బాల్‌రాజు
12. కామారెడ్డి    – షబ్బీర్‌ అలీ
13. జగిత్యాల    – జీవన్‌ రెడ్డి
14. రామగుండం    – ఎం.ఎస్‌.రాజ్‌ ఠాకూర్‌
15. మంథని    – శ్రీధర్‌బాబు దుద్దిళ్ల
16. పెద్దపల్లి    – సీహెచ్‌ విజయరమణారావు
17. కరీంనగర్‌    – పొన్నం ప్రభాకర్‌
18. చొప్పదండి(ఎస్సీ)    – డాక్టర్‌ మేడిపల్లి సత్యం
19. వేములవాడ    – ఆది శ్రీనివాస్‌
20. మానకొండూరు (ఎస్సీ)    – ఆరేపల్లి మోహన్‌
21. అందోల్‌æ(ఎస్సీ)    – దామోదర రాజనర్సింహ
22. నర్సాపూర్‌    – వి.సునీతాలక్ష్మారెడ్డి
23. జహీరాబాద్‌ (ఎస్సీ)    – డాక్టర్‌ జె.గీతారెడ్డి
24. సంగారెడ్డి    – జగ్గారెడ్డి
25. గజ్వేల్‌    – ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
26. కుత్బుల్లాపూర్‌    – కూన శ్రీశైలంగౌడ్‌
27. మహేశ్వరం    – పి.సబితాఇంద్రారెడ్డి
28. చేవెళ్ల (ఎస్సీ)    – కేఎస్‌ రత్నం
29. పరిగి    – టి.రామ్మోహన్‌రెడ్డి
30. వికారాబాద్‌ (ఎస్సీ)    – గడ్డం ప్రసాద్‌కుమార్‌
31. తాండూరు    – పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డి
32. ముషీరాబాద్‌    – ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌
33. నాంపల్లి    – ఫిరోజ్‌ఖాన్‌
34. గోషామహల్‌    – ఎం.ముఖేశ్‌గౌడ్‌
35. చార్మినార్‌    – మహ్మద్‌ గౌస్‌
36. చాంద్రాయణగుట్ట    – ఈస మిస్రి
37. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – సర్వే సత్యనారాయణ
38. కొడంగల్‌    – రేవంత్‌రెడ్డి
39. జడ్చర్ల    – డా. మల్లు రవి
40. వనపర్తి    – డాక్టర్‌ జి.చిన్నారెడ్డి
41. గద్వాల్‌    æ– డీకే అరుణ
42. అలంపూర్‌ (ఎస్సీ)    – సంపత్‌కుమార్‌
43. నాగర్‌కర్నూల్‌    – నాగం జనార్దన్‌ రెడ్డి
44. అచ్చంపేట(ఎస్సీ)    – సీహెచ్‌ వంశీకృష్ణ
45. కల్వకుర్తి    – డా. వంశీచంద్‌ రెడ్డి
46. నాగార్జునసాగర్‌    – కె.జానారెడ్డి
47. హుజూర్‌నగర్‌    – ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
48. కోదాడ    – ఎన్‌.పద్మావతిరెడ్డి
49. సూర్యాపేట    – ఆర్‌.దామోదర్‌రెడ్డి
50. నల్లగొండ    – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
51. మునుగోడు    – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
52. భువనగిరి    – కె.అనిల్‌కుమార్‌రెడ్డి
53. నకిరేకల్‌(ఎస్సీ)    – చిరుమర్తి లింగయ్య
54. ఆలేరు    – బి.భిక్షమయ్యగౌడ్‌
55. స్టేషన్‌ఘన్‌పూర్‌(ఎస్సీ)    – సింగపూర్‌ ఇందిర
56. పాలకుర్తి    – జంగా రాఘవరెడ్డి
57. డోర్నకల్‌(ఎస్టీ)    – డాక్టర్‌ జె.రామచంద్రునాయక్‌
58.మహబూబాబాద్‌(ఎస్టీ)    –పోరిక బలరాంనాయక్‌
59. నర్సంపేట    – దొంతి మాధవరెడ్డి
60. పరకాల    – కొండా సురేఖ
61. ములుగు(ఎస్టీ)    – సీతక్క
62. పినపాక(ఎస్టీ)    – రేగ కాంతారావు
63. మధిర(ఎస్సీ)    – మల్లు భట్టి విక్రమార్క
64. కొత్తగూడెం    – వనమా వెంకటేశ్వర్‌రావు
65. భద్రాచలం(ఎస్టీ)    – పోడెం వీరయ్య 

మరిన్ని వార్తలు