‘కొండా’ మాస్టర్‌ స్కెచ్‌!

2 Mar, 2019 08:37 IST|Sakshi

ప్రతి ఊరిలో పది మంది క్రియాశీలక వ్యక్తుల ఎంపిక

ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు

తటస్థ సర్పంచులకు ఎంపీ కోటా నిధులతో విశ్వేశ్వర్‌రెడ్డి గాలం

రంగంలోకి ప్రోగ్రెసివ్‌ తెలంగాణ, కేవీఆర్‌ ట్రస్టు బృందాలు

రెండోసారి పక్కాగా విజయం సాధించేందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇందుకు తన ఎన్జీఓలను వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో ప్రభావం చూపించే కొందరిని ఎంపిక చేసుకొని తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. అదేవిధంగా తటస్థ సర్పంచ్‌లకు ఎంపీ కోటా నిధుల పేరుతో గాలం వేస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందడి ప్రారంభం కాకముందే.. ఇంకా ఇతర పార్టీలు హడావుడి ఆరంభం చేయకముందే  కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దూసుకుపోతున్నారు.

పరిగి: చేవెళ్ల పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికార పార్టీని తూర్పార పడుతున్నారు. జోన్‌ విషయంలో నిరుద్యోగులకు, యువతకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో విశ్వేశ్వర్‌రెడ్డి కొంతకాలం క్రితం ‘కారు’ దిగి ‘చేతి’ని అందుకున్న విషయం తెలిసిందే. రెండోసారి ఎంపీగా విజయం సాధించాలని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఇందులో భాగంగా తన మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఎన్నికల నోటిఫికేషన్‌ సైతం రాకముందే ఆయన పాచికలు కదుపుతున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రణాళికలు అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత కూడా టికెట్ల కేటాయింపులో నాన్చుడు ధోరణిని పాటించే కాంగ్రెస్‌ అధిష్టానం చేవెళ్ల సీటుపై కొండాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మినహా ఆ పార్టీ తరఫున కొండాకు పోటీగా టికెట్‌ ఆశించే వారు కూడా లేకపోవడం ఎంపీకి సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రచారాన్ని చాపకింది నీరులా ముందుకు తీసుకెళ్తున్నారని  విశ్లేషకులు భావిస్తున్నారు.

సర్పంచ్‌లకు గాలం..  
ప్రస్తుతం ఎంపీ హోదాలో కొనసాగుతున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ పార్టీ సర్పంచులకు చేరువవుతూనే తటస్తంగా ఉన్న సర్పంచుల జాబితాను తెప్పించుకున్నారు. తమ ఎన్జీఓ సభ్యుల సాయంతో సదరు సర్పంచులు తనను కలిసేలా చూస్తున్నారు. వారికి ఎంపీ కోటా నిధులు మంజూరు చేస్తూ వేసి వారిని పార్టీలకు అతీతంగా తనకు అనుచరులుగా మలుచుకుంటున్నారు. తద్వారా రోబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పక్కాగా ప్లాన్‌ అమలు చేస్తున్నారు. అయితే, చాలామంది సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా ఆయనను కలుస్తుండగా.. మీడియాలో ఫోకస్‌ కాకుండా, ఇతర పార్టీలకు ఎత్తుగడలకు దొరకకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

క్షేత్రస్థాయిలో క్రియాశీలక వ్యక్తులు
ఎవరికీ తెలియకుండా తమ పనులు చక్కదిద్దడం లో దిట్టలైన వ్యక్తులను తయారు చేయడంలో ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇలా తమ ఎన్జీఓ సభ్యులు గ్రామాల్లో క్రియాశీలకంగా పని చేస్తూనే మరింత మందిని తయారు చేసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో పదిమంది ప్రభావిత వ్యక్తులను గుర్తించి వారిని ఎంపీకి దగ్గర చేస్తున్నారు. వారిని తమకు అనుకూలంగా మార్చుకు ని ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అధికార పార్టీ బిత్తర చూపులు  
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్‌ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుండగా.. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌తో పాటు మరికొందరి నేతల పేర్లు సైతం తెరమీదికి వస్తున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమ పార్టీ ఎంపీ అభ్యర్థి ఫలానా వ్యక్తి అని ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ వైపు కొండా తన మాస్టర్‌ ప్లాన్‌తో పక్కాగా ముందుకు దూసుకుపోతుండగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బిత్తరచూపులు చూడాల్సి వస్తోంది. ఒక్కొక్కరుగా తమ కేడర్‌ సైతం అవతలి గడప తొక్కితే పరిస్థితి ఏంటని ఆలోచనతో ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ బలోపేతం పైనా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.  

రంగంలోకి ఎన్జీఓలు..
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు  కేవీఆర్‌ ట్రస్టు,  ప్రొగ్రెసివ్‌ తెలంగాణ వంటి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చే సుకున్నారు. ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో ఎన్నికల కోసం వినియోగించుకుంటున్నారు. ఎన్టీఓల్లో ఆర్గనైజర్లు, కో ఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వారు ప్రస్తుతం విశ్వేశ్వర్‌రెడ్డికి క్షేత్రస్థాయిలో సహకరిస్తున్నారు. ఈమేరకు ప్రతి గ్రామంలో సర్వేలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితిపై, బలాబలాలపై అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు