మోదీ కోసం పాదయాత్ర.. కాంగ్రెస్‌ టికెట్‌

23 Mar, 2019 20:40 IST|Sakshi

భువనేశ్వర్ ‌: ముక్తికాంత బిస్వాల్ పేరు చెప్పగానే గుర్తు పట్టడం కష్టం. అదే ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఢిల్లీ వెళ్లిన యువకుడు అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. ఈ మహా పాదయాత్రతో ఒక్కసారిగా ముక్తికాంత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా ఈయన మరోసారి వార్తల్లోకెక్కారు. మోదీని కలిసేందుకు పాదయాత్ర చేసిన ముక్తికాంతకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ఒడిశా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముక్తికాంత పేరు కూడా ఉంది. రూర్కెలా శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఈయనను బరిలోకి దింపింది.

రూర్కెలా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 31ఏళ్ల ముక్తికాంత బిస్వాల్‌ మోదీని కలిసేందుకు గతేడాది 71 రోజుల పాటు 1500 కిలోమీటర్లు దూరం కాలి నడకన ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నారు. రూర్కెలా ప్రాంతంలో ఉన్న ఇస్పాత్‌ జనరల్‌ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని 2015లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు గడిచినా.. ఆ హామీ అమలు కాలేదు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు ముక్తికాంత ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దాంతో అతడికి అవసరమైన కొన్ని వస్తువులను బ్యాగులో పెట్టుకుని చేతిలో జాతీయ జెండాతో గతేడాది ఏప్రిల్‌లో తన గ్రామం నుంచి నడక ప్రారంభించారు. అయితే కొన్ని వందల కిలోమీటర్లు నడిచేసరికి మధ్యలో ఆయన ఆరోగ్యం పాడైంది. ఆగ్రాలో ఓ చోట హైవేపై కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ తన నడక కొనసాగించారు. అయితే ఇంత శ్రమ పడి ఢిల్లీ చేరుకున్నప్పటికీ ముక్తికాంత.. ప్రధాని మోదీని కలుసుకోలేకపోయారు.

మరిన్ని వార్తలు