న్యాయపరంగానే ఎదుర్కొందాం

21 Mar, 2018 02:13 IST|Sakshi
సీఎల్పీ నేత కె.జానారెడ్డి

ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంపై కాంగ్రెస్‌ నిర్ణయం

జానారెడ్డి నివాసంలో సీనియర్‌ నేతల సమావేశం 

భేటీకి హాజరైన మాజీ స్పీకర్లు సురేశ్‌ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌ 

గతంలో తాము ఎలా వ్యవహరించామనేదానిపై వివరణ 

రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ ఓటు హక్కు కోరుతూ ఈసీని ఆశ్రయించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించిన విషయంలో న్యాయపోరాటం ద్వారానే ముందుకెళ్లాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఓటు వేయించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టాలని భావిస్తోంది. ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల అనంతరం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు మంగళవారం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేవంత్‌ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీతోపాటు మాజీ స్పీకర్లు కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్, హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హాజరయ్యారు. 

బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేల భవితవ్యంతోపాటు సోమవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యసభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. బహిష్కరణ వేటు పడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌లతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయించేందుకు గల అవకాశాలపై చర్చ జరిగింది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కొంత అనుకూలంగానే ఉందని, ఆరు వారాలపాటు ఈ ఎమ్మెల్యేల స్థానాల ఖాళీని నోటిఫై చేసే వెసులుబాటు లేకపోవడం, రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ల పత్రాలపై వారిద్దరూ సంతకాలు చేసినప్పటికీ నామినేషన్‌ తిరస్కారానికి గురికాకపోవడం కూడా కలిసి వస్తుందనే చర్చ జరిగింది. వీటిని పేర్కొంటూ మరోమారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. ఈ విషయమై కోమటిరెడ్డి, సంపత్‌లు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. 

అప్పుడేం చేశామంటే.. 
గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాల రాద్ధాంతం సాధారణంగా జరిగే విషయమే అయినా, కాంగ్రెస్‌ సభ్యుల దాడి వల్ల మండలి చైర్మన్‌కు గాయం అయిందని చిత్రీకరించి ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారన్న దానిపై మాజీ స్పీకర్ల నుంచి వివరణ తీసుకున్నారు. ‘నేను స్పీకర్‌గా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి చేసిన దాడి వల్ల అప్పటి మండలి చైర్మన్‌ చక్రపాణికి గాయమైంది. ఇదే గవర్నర్‌ నరసింహన్‌పై హరీశ్‌రావు చేసిన దాడి విజువల్స్‌ కూడా పరిశీలించాం. 

ఆ తర్వాత ఇద్దరు సభ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, రూల్స్‌ అన్నింటినీ పరిశీలించి, బీఏసీలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే వారిని వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశాం’అని నాదెండ్ల మనోహర్‌ వివరించారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, బీఏసీలో చర్చించకుండా ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమేనని ఇద్దరు మాజీ స్పీకర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈనెల 27న హైకోర్టు తదుపరి విచారణ అనంతరం వచ్చే నిర్ణయాన్ని బట్టి ప్రజల్లోకి వెళ్లాలని, అవసరమైతే నల్లగొండ, అలంపూర్‌లలో భారీ సభలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. 

న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది: ఉత్తమ్‌ 
భేటీ అనంతరం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఈ విషయంలో ఖచ్చితంగా గెలుపు న్యాయం వైపే ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా తమ ఎమ్మెల్యేలను బహిష్కరించారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తకుండా ఉండేందుకే ప్రతిపక్ష పార్టీకి చెందిన తమను సస్పెండ్‌ చేశారని, ఇలాంటి ఘటన దేశంలోనే ఎక్కడా జరగలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలంతా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికే ఓటేయాలని, బహిష్కరణకు గురైన తమ ఎమ్మెల్యేలు ఓటేస్తారని అన్నారు. 

విలాసాలు మానండి: కోమటిరెడ్డి 
కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అదీ దేశంలోనే నిజాయితీ ఉన్న సీఎంగా పేరున్న మమతా బెనర్జీ దగ్గరికి వెళ్లి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో ఓ పక్క బీజేపీకి మద్దతిస్తూ మరోపక్క థర్డ్‌ ఫ్రంట్‌ అంటున్న కేసీఆర్‌కు ఈ విషయంలో మమతాబెనర్జీ మొట్టికాయలు వేశారనే వార్తలు వస్తున్నాయన్నారు. మమత సింపుల్‌గా ఉంటారని, ఆమె కట్టె కుర్చీలో కూర్చుని మాట్లాడుతారని, ఆమెను చూసిన తర్వాతైనా కేసీఆర్‌లో మార్పు రావాలని, వందల కోట్లు ఖర్చు చేస్తున్న విలాస జీవితానికి స్వస్తి పలకాలని ఎద్దేవా చేశారు.  

>
మరిన్ని వార్తలు