నేడు కాంగ్రెస్‌ కీలక భేటీ 

28 Aug, 2018 02:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అధ్యక్షతన గాంధీభవన్‌లో మంగళవారం జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని 60 మంది పార్టీ ముఖ్యనేతలను ఆహ్వానించారు. వీరిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తోన్న ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, మాజీ ఉపాధ్యక్షుల్లో ముఖ్యనేతలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల సంకేతాలతో పాటు సీఎం ఢిల్లీ పర్యటన, భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్ల నేపథ్యంలో రాజకీయ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని వచ్చే నెలలో రద్దు చేసే పక్షంలో తాము ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన తీరు, బస్సుయాత్ర నిర్వహణ, అభ్యర్థుల జాబితా, పార్టీలో సమన్వయం, శక్తియాప్‌ ద్వారా కార్యకర్తల నమోదు సహా ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న దానిపై నేతల అభిప్రాయాలను ఈ సమావేశంలో తెలుసుకోనున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

బస్సు యాత్ర కమిటీ భేటీ 
గాంధీభవన్‌లో బస్సు యాత్ర కమిటీ సమావేశమయింది. షబ్బీర్‌ అలీ, దామోదర్‌రెడ్డిలతో పాటు పలువురు బస్సుయాత్ర కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరై షెడ్యూల్‌ గురించి చర్చించారు. మరోవైపు ఆర్‌సీ కుంతియా కూడా ఓ హోటల్‌లో ఏఐసీసీ కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

మరిన్ని వార్తలు