విలువలు వదిలేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ

10 Jan, 2019 16:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందూత్వ, జాతీయవాదాన్ని ఎలా త్రిప్పికొట్టాలో తెలియక కాంగ్రెస్‌ పార్టీ తికమక పడుతోంది. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తోంది. అధికారం కోసం అంగలారుస్తూ బీజేపీకన్నా ఎక్కువగా ఆత్మవంచనకు పాల్పడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది.

కాంగ్రెస్‌ పార్టీలో పేరుకుపోతున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు మొట్టమొదటిసారిగా ప్రజల ముందు జనవరి మూడవ తేదీన బయటపడ్డాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి యాభై ఏళ్లకు లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పిలుపుమేరకు పాటిస్తున్న ‘నిరసన దినం’లో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు నల్లబ్యాడ్జీలు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్‌ ఆవరణలోనే వారిని సోనియాగాంధీ అడ్డుకుని ఆ బ్యాడ్జీలను తీసి వేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయస్థాయిలో ఆడ, మగ మధ్య లింగ వివక్ష చూపకూడదని ఆమె హితవు చెప్పారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు ఒకే తీరుగా స్పందించాయి. ఇరు పార్టీలు తీర్పును హర్షించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో బీజేపీ ముందుగా ప్లేటు ఫిరాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్లేటు ఫిరాయించింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల లోపు మహిళలను అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఒకటవ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్‌ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్‌ ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నదని, పార్టీ అభిప్రాయమే తనదని చెప్పారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలంటారు. వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండవచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి. ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే  ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవడం అవుతుంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే చేస్తోంది.

ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో ‘వందేమాతరం’ గీతాలాపనను రద్దు చేశారు. గీతాలాపన చేయడమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ ప్రభుత్వం ఆచరిస్తున్న సంప్రదాయాన్ని ఆయన పక్కన పడేశారు. ఇక ప్రతినెల బీజేపీ శాసన సభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌవాన్‌ ప్రకటించగానే కమల్‌ నాథ్‌ మాట మార్చారు. మరింత మెరుగ్గా ‘వందేమాతరం’ గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బ్యాండుతో ఓ కిలోమీటరు మార్చింగ్‌తో వందేమాతరం గీతాలాపనను ప్రవేశపెట్టారు.

రాజస్థాన్‌లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంపైన సాగిర్‌ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందూత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేస్తే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం, పార్టీ మౌనం పాటించింది. గతంలోనయితే కాంగ్రెస్‌ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్‌ పార్టీ తన సిద్దాంతాలకు తిలోదకాలిస్తోందని అర్థం అవుతోంది. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో, లేదో చెప్పలేంగానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదం ఉంటుందన్నది మరచిపోరాదు.

మరిన్ని వార్తలు