హస్తం నిస్తేజం

21 Mar, 2019 11:26 IST|Sakshi

యూపీ, బిహార్, బెంగాల్,ఢిల్లీలో అగమ్యగోచరం

సందిగ్ధంలో మహాగఠ్‌బంధన్‌ ఏర్పాటు!

ఆప్‌–కాంగ్రెస్‌ పొత్తుకు శరద్‌ పవార్‌ చొరవ.. రాహుల్‌తో చర్చలు

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడని సామెత. మరి కాలం కలిసిరాకపోతే..ఆ ఏముంది.. పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీలా  మారిపోతుంది! ఏళ్లుగా తోడున్న మిత్రులు ముఖం చాటేస్తారు! అవసరం కొద్దీ చేయి కలిపిన వాళ్లూ.. పెద్ద పెద్ద అవసరాలు వెతుక్కుని వెళ్లిపోతారు! ఎన్నికల వేళ కాంగ్రెస్‌ మిత్రపక్షాలన్నీ సరిగ్గా ఇలాగే వ్యవహరిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌తో అప్పటివరకూ జరిగిన పొత్తు మాటలను అటకెక్కించి నగరంలోని మొత్తం ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. సీట్ల సంఖ్యలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, సొంతపార్టీలోనే పొత్తులపై వ్యతిరేకత వ్యక్తమవుతూండటం దీనికి కారణాలని కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోవచ్చుగానీ.. ఇంకో 20 రోజుల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న వేళ 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఇదేమంత మంచి సంకేతమైతే కాదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి పెట్టని కోటలా ఉన్న యూపీతోపాటు అనేక కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒకప్పుడు ఒంటిచేత్తో ఈ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఇప్పుడు కనీసం ఇంకొకరి సాయం కూడా దక్కని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

దీంతో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలసి ప్రతిపాదించిన మహాఘఠ్‌ బంధన్‌ ఉనికే సందిగ్ధంలో పడింది. యూపీ, బెంగాల్‌ తరువాత తాజాగా బిహార్, ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆధిపత్యం చెలాయించాలని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. మరోవైపు, కాంగ్రెస్‌ కూడా వెనకంజ వేయడం లేదని, అందుకే ప్రతిష్టంభన ఏర్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, ఆప్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ముందుకొచ్చి రాహుల్‌ గాంధీతో మాట్లాడారు. ఆ తరువాత ఆప్‌తో పొత్తును పునఃపరిశీలించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పంజాబ్, హరియాణాల్లో సీట్లు కేటాయించాలని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పట్టుబడుతుండగా, కాంగ్రెస్‌ అందుకు అంగీకరించడం లేదు. ఇక ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ నాలుగు సీట్ల కోరుతుండగా, మూడుకు మించి కేటాయించేందుకు ఆప్‌ ఆసక్తి కనబరచడం లేదు.

పొత్తులపై డైలమా...?
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలోనే కాంగ్రెస్‌లో కొంత డైలమా ఉం దని తెలుస్తోంది.కొంతమంది పొత్తులతో లాభమంటూండగా.. ఇంకో వర్గం మాత్రం ససేమిరా అంటోంది. రాజకీయాలు మారిపోయిన నేపథ్యం లో పాతకాలపు ఒంటెత్తు పోకడలను పక్కనబెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా అందరినీ కలుపుకుపోవాలని ఒక వర్గం సూచిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ విషయాన్నే తీసు కుంటే.. ఇంతకాలం అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడినందున ఒకప్పటి కాంగ్రెస్‌ బలమైన దళితులు పార్టీకి దూరమయ్యారని.. బీఎస్పీ లాంటి పార్టీలు ఆయా వర్గాల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో వారితో పొత్తులు అత్యవసరమని వీరు అంటున్నారు. అగ్రవర్ణ బ్రాహ్మణుల్లో అధికు లు బీజేపీ వైపు.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడం ద్వారా మాత్రమే కాంగ్రెస్‌ పూర్వపు స్థితికి చేరుకోగలదన్నది వీరి అభిప్రాయం. అయితే.. ప్రాంతీయ పార్టీలకు చోటు కల్పించడం అసలుకే మోసం తెస్తుందని.. కొంత కాలం తరువాత కాంగ్రెస్‌ పార్టీ మనుగడకే ముప్పు అన్నది సంప్రదాయ వాదుల వాదన. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏమైందో చూడాలని వీరు అంటున్నారు. కష్టమైనాసరే.. పార్టీ పునరుజ్జీవానికి ఒంటరిపోరే మేలన్నది వీరి అభిప్రాయం. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలను పరిరక్షించుకుంటూనే దీర్ఘకాలపు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని.. బలీయమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని వీరు సూచి స్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు సంపాదించడం ఇతర పార్టీలతో పొత్తు చర్చలకు బలమిస్తుందని వీరు అంటున్నారు. 2007 నాటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమైన రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన తరువాత మాత్రం అందుకు భిన్నమైన మార్గంలో వెళుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఒంటెత్తు పోకడలు కారణమా?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమధ్య చేసిన ప్రసంగంలో కేసీఆర్‌ తన వద్ద పనిచేశాడని, అయినా తాను తగ్గానని మాట్లాడారు గుర్తుందా? ఈ హాస్యాస్పదం వ్యాఖ్య కాంగ్రెస్‌ పార్టీ పోకడలకూ వర్తిస్తుంది. పెద్దన్న తరహాలో వ్యవహరిస్తుండటాన్ని భాగస్వామ్య పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత డిసెంబర్‌లో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్‌ వైఖరి మరింత మారిందన్నది ఎస్పీ, బీఎస్పీ వర్గాల ఆరోపణ. కేవలం ఒక్క సీటు తక్కువ కేటాయిస్తున్నారన్న కారణంగా ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కుదుర్చుకోకపోవడం.. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌పార్టీలతోనూ గిల్లికజ్జాలకు దిగడం కాంగ్రెస్‌ వైఖరికి నిదర్శనంగా చెబుతున్నారు. 2004లో చిన్న చిన్న పార్టీలతోనూ సానుకూలంగా వ్యవహరించి పొత్తులు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ ఈ సారి మాత్రం పెడసరంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడాన్ని ఇష్టపడని చాలామంది కాంగ్రెస్‌ వైఖరిపై గుర్రుగానే ఉన్నారు. బీజేపీ, మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో విఫలమైందని.. ఈ నిర్లక్ష్యానికి ఫలితం అనుభవించడం ఖాయమని అంటున్నారు. 

పంతం వీడని ఆర్జేడీ, సీపీఎం..
బిహార్‌లో విశ్వసనీయ భాగస్వామి ఆర్జేడీతోనూ కాంగ్రెస్‌కు తలనొప్పులు తప్పట్లేదు. సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నామని, త్వరలోనే కొలిక్కి వస్తుందని బిహార్‌ ఏఐసీసీ ఇన్‌చార్జి శక్తిసింగ్‌ గోహిల్‌ చెప్పారు. 11 సీట్లు కేటాయిస్తామని గత బుధవారం ఆర్జేడీ చేసిన ఆఫర్‌కు కాంగ్రెస్‌ నొచ్చుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు 8 సీట్లకు మించి ఇవ్వలేమని ఆర్జేడీ చెబుతుండటం గమనార్హం. ఇక బెంగాల్‌ విషయానికి వస్తే కాంగ్రెస్, సీపీఎం కలసి పనిచేస్తాయని భావించినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సోమవారం రాత్రి చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. బెంగాల్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ సలహాతో ఒంటరిగానే పోటీకి రాహుల్‌ అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. తమను సంప్రదించకుండానే సీపీఎం ఏకపక్షంగా వ్యవహరించి 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి మోసం చేసిందని బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు సోమెన్‌ మిత్రా ఆరోపించారు. రాష్ట్రంలోని 42 స్థానాల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన ప్రకటించారు. 

మరిన్ని వార్తలు