కాంగ్రెస్‌ పునరుత్థానం సాధ్యమా?

4 Jul, 2019 14:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ స్వాతంత్య్రద్యోమానికి నాయకత్వం వహించడమే కాకుండా, అనంతరం జరిగిన ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే తాను పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ వచ్చిన రాహుల్‌ గాంధీ ఆ మధ్యనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను పార్టీ వర్కింగ్‌ కమిటీ తిరస్కరించింది. అప్పటి నుంచి అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందిగా పార్టీలోని సీనియర్‌ నాయకులు ఎంత నచ్చ చెబుతూ వచ్చినప్పటికీ ఆయన వినలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ రాహుల్‌ గాంధీ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించడమే కాకుండా పార్టీకి నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. పార్టీ ఓటమికి తనతోపాటు బాలా మంది బాధ్యులని, తాను రాజీనామా చేయకుండా వారిపై చర్య తీసుకోవడం సముచితం కాదు కనుక తన రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన సూచించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న నేపథ్యంలో రాహుల్‌ మాటలకు ప్రాధాన్యత చేకూరింది. గాంధీ కుటుంబం నుంచి కూడా పార్టీ అధ్యక్ష పదవికి ప్రాతినిధ్యం ఉండరాదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేయడంతో నాయకత్వ ఎంపిక మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీలో తల పండిన సీనియర్‌ నాయకులు ఎంతో మంది ఉన్నారు. అసమ్మతికి అవకాశం లేకుండా వారి నుంచి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడం కష్టమే. అందుకనే ప్రస్తుతానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్‌ వోరాను పార్టీ వర్కింగ్‌ కమిటీ ఎన్నుకుంది.

గాంధీ వారసత్వం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కాగలదా? మనుగడ సాధించగలదా? అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. కాంగ్రెస్‌ పార్టీలో ఆది నుంచి అతిథి పాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌  గాంధీని పార్టీ అధ్యక్షుడిగా క్రియాశీలక రాజకీయాల్లోకి పద్ధతి ప్రకారం తీసుకరాక పోవడం వల్ల ఆయనతోపాటు పార్టీకి నష్టం జరిగింది. ఆయన్ని నియామక పద్ధతిలో కాకుండా ఎన్నిక పద్ధతిలో తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. రాహుల్‌ గాంధీని ఆదిలోనే దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఆయనకు వ్యతిరేకంగా 2017 నుంచే చురుకైన ప్రచారాన్ని చేపట్టింది. రాహుల్‌ను నామ్‌ధార్‌ (వారసుడు), మోదీని కామ్‌ధార్‌ (పనిచేసేవారు) అంటూ ఓ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లింది. ఆ అపవాదు నుంచి పార్టీని రక్షించేందుకే రాహుల్‌ గాంధీ, తమ వారసులు ఎవరు వద్దని చెప్పి ఉండవచ్చు. లేకపోతే పార్టీ పగ్గాలు ఆయన సోదరి ప్రియాంక గాంధీకి ఇస్తే నాయకత్వ సమస్య క్షణాల్లో తీరిపోయేది. ప్రియాంకకు అప్పగిస్తే భవిష్యత్తులో అమె నుంచి తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం కష్టం కావచ్చన్న ఆందోళన కూడా ఆయనకు కలిగి ఉండవచ్చు.

గాంధీ–నెహ్రూ వారసులు కాకుండా పార్టీకి నాయకత్వం వహించిన సమర్థులైన నాయకులు సుభాస్‌ చంద్రబోస్‌ నుంచి సీతారామ్‌ కేసరి వరకు ఎక్కువే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ 16వ అధ్యక్షుడుకాగా, వారసత్వంగా వచ్చిన అధ్యక్షుల్లో ఆరవ వాడు. అయితే అప్పట్లో సైద్ధాంతిక కారణాలతోనే అధ్యక్ష పదవికి పోటీ చేసే వారు. అలాంటి కారణాల వల్లనే దిగిపోయేవారు. ఆ తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పెరిగినప్పుడల్లా అసమ్మతి నోరు మూసేందుకు పార్టీ వారసులను తెరమీదకు తెచ్చింది. వారసత్వంకు వ్యతిరేకంగా పార్టీని వదిలేసి కొత్త పార్టీలు పెట్టిన వారు ఉన్నారు. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌లు పార్టీ నుంచి అలాగే తప్పుకున్నారు. అధికారమే పరమావధిగా పార్టీ రాజకీయాలు మారిన నేటి పరిస్థితుల నేపథ్యంలో చిత్తశుద్ధితో పార్టీ పునర్నిర్మాణం కోసం ఎవరు ముందుకొస్తారు ? వచ్చినా ఏ మేరకు విజయం సాధించగలరన్నది ప్రస్తుతానికి శేష ప్రశ్నే!

మరిన్ని వార్తలు