టికెట్‌ కావాలంటే పది నిబంధనలు పాటించాల్సిందే..!

23 Sep, 2019 15:26 IST|Sakshi

చండీగఢ్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగటానికి టికెట్లు కోరుకునే ఆశావహులకు హర్యానా కాంగ్రెస్‌ పార్టీ పది నిబంధనలతో కూడిన  ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ టికెట్ల కోసం సమర్పించే ఫారాలను అందజేయడానికి ముందుగా సెప్టెంబర్‌ 23ను చివరి తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిని ఈ నెల 25 వరుకు పొడిగిస్తూన్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్‌ చీఫ్‌ కుమారి సెల్జా  ఈ విషయాన్ని ‍ప్రకటించారు. ‘ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట​ కోరుకునే వారి ఉత్సాహం, సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిగణలోకి తీసుకుని.. ఫారాలను సమర్పించే గడువును మరో రెండు రోజులు అధిష్టానం పెంచిందని ’ట్విటర్‌లో పేర్కొన్నారు.

అదే విధంగా టికెట్‌ ఆశించే ఆశావహులు పార్టీ ప్రకటించిన నిబంధనల ప్రకారం..  ‘గాంధేయ జీవన విధానాన్ని అనుసరిస్తూ.. ఖాదీ వస్త్రాలను ధరించాలి. మధ్యపానం అలవాటు ఉండకూడదు. లౌకిక విలువలను నమ్మూతూ.. ప్రజా, వ్యక్తిగత జీవితంలో కుల, మత వివక్షతను చూపకూడదని’ ఆయన తెలిపారు. అదేవిధంగా టికెట్‌ కావాలని ఆశించేవారు ఎట్టిపరిస్థితుల్లో ప్రజావేదికలపై పార్టీ పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు.

టికెట్ కోరుకునేవారు నింపిన ఫారాలను పరిశీలించడానికి కాంగ్రెస్‌ నేత మధుసూదన్ మిస్త్రీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టికెట్‌ కేటాయింపుకు తుది నిర్ణయం కోసం ఈ ఫారాలను కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేస్తుందని వెల్లడించారు. రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు, కాంగ్రెస్‌ 15 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు