పార్టీలో ఏకపక్ష పోకడలు 

6 Jan, 2020 02:41 IST|Sakshi

సీనియర్లకు గౌరవం ఇచ్చే పద్ధతి ఇదేనా?

కుంతియాపై సీనియర్ల కస్సుబుస్సు..

పొన్నాల, వీహెచ్, దామోదర ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏకపక్ష పోకడలు పోతున్నారని, సీనియర్‌ నేతలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, దామోదర రాజనర్సింహలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఈ ముగ్గురు నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆక్షేపణలు చేసిన ఆ ముగ్గురు నేతలు కుంతియాపై కస్సుబస్సులాడినట్టు తెలిసింది.

మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జుల నియామకంలో ఎవరిని సంప్రదించారని, ఇష్టం వచ్చిన వారిని ఇన్‌చార్జులుగా నియమించారని అభ్యంత రం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తుంటే మరికొందరు కాంగ్రెస్‌ను బతికించుకునేందుకు పోరాడుతున్నారని వారు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాల్సి ఉంటుందని, సీనియర్లను విస్మరించడం మంచిది కాదని అభిప్రాయపడ్డ నేతలు.. భవిష్యత్తులోనైనా తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కుంతియాను కోరారు. కాగా, కుంతియాను పలువురు టీపీసీసీ నేతలు కూడా ఆదివారం కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. 

మరిన్ని వార్తలు