70 సార్లు చీలిన పార్టీ!

16 May, 2019 04:38 IST|Sakshi

దేశంలో వందల సంఖ్యలో రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో కొన్ని సొంతంగా ఏర్పడినవయితే మరికొన్ని పార్టీల చీలిక వల్ల పుట్టినవి. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మన దేశంలో కొనసాగుతున్న పార్టీ కాంగ్రెస్‌. వందేళ్ల చరిత్ర గల ఈ పార్టీ నుంచి అనేక ఇతర పార్టీలు పుట్టుకొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వరకు కాంగ్రెస్‌ పార్టీ 70 సార్లు చీలిపోయింది. అంటే కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో కొందరు పార్టీ నుంచి బయటకొచ్చేసి కొత్త పార్టీలు పెట్టారన్నమాట. ఒక పార్టీ నుంచి ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చినా వాటిలో చాలా వరకు కాలగమనంలో కనుమరుగవడమో, ఇతర పార్టీల్లో విలీనమవడమో జరిగింది.

ఐదారు పార్టీలు మాత్రం మాతృ పార్టీ కంటే ఎక్కువ శక్తిమంతమయ్యాయి. కాంగ్రెస్‌లో మొట్టమొదటి చీలిక 1951లో వచ్చింది. జేబీ కృపలానీ కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1956లో సి.రాజగోపాలాచారి ఇండియన్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1959లో రాజగోపాలాచారి, ఎన్‌జీ రంగా కలిసి స్వతంత్ర పార్టీ, 1964లో కె.ఎం జార్జి కేరళ కాంగ్రెస్, 1967లో చరణ్‌సింగ్‌ నాయకత్వంలో భారతీయ క్రాంతి దళ్, 1967లో అజయ్‌ ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్‌ ఏర్పడ్డాయి. 1969లో కె.కామరాజ్, మొరార్జీ దేశాయ్‌లు పార్టీ నుంచి బయటకొచ్చేసి కాంగ్రెస్‌(ఓ)పేరుతో పార్టీ పెట్టారు.

మరో నేత ఇందిరా గాంధీ కూడా అదే సమయంలో కాంగ్రెస్‌(ఐ) పేరుతో మరో పార్టీ పెట్టారు. 1969లో బిజూ పట్నాయక్‌ ఉత్కళ్‌ కాంగ్రెస్, 1997లో మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్, 2011లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌.. ఇలా 70కి పైగా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలు కొన్ని ఆయా రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గుకు రాలేకపోవడంతో కొన్ని అస్తిత్వం కోల్పోయాయి. తృణమూల్‌ కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు  బలపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాతృ పార్టీ కంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నాయి. 2014  ఎన్నికలను చూస్తే కాంగ్రెస్‌ 464 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు గెలుచుకుంది. తృణమూల్‌ 45 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాలను దక్కించుకుంది. ఎన్‌సీపీ 36 సీట్లకుగాను 6, వైఎస్సార్సీపీ 38 కిగాను 9 సీట్లలో విజయం సాధించాయి.

మరిన్ని వార్తలు