కాంగ్రెస్‌ పార్టీకి పొత్తుల తిప్పలు

21 Feb, 2019 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీ, మిత్రపక్షాల పొత్తుల విషయంలో వేగంగా ముందుకు దూసుకుపోతుంటే మహాకూటమే లక్ష్యం అంటూ ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, పొత్తుల విషయంలో ఇంకా ఎందుకు వెనకబడిపోతోంది? ఎందుకు మిత్రపక్షాల మధ్య పొరపొచ్చాలు ఇంకా కొనసాగుతున్నాయి ? రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి కార్యక్రమం రూపొందించేందుకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరద్‌ పవార్‌ ఇంట్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ తదితరులు ఇటీవల సమావేశమయ్యారు.

జాతీయ స్థాయిలో ఓ అవగాహనకు రావాలని, రాష్ట్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరస్పరం పోటీ చేయవచ్చని రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆది నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్న రాహుల్‌ గాంధీ, ఎన్నికల పొత్తు విషయంలో రాష్ట్ర పీసీసీలకే పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో డోలాయమానం తప్పడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో తణమూల్‌ కాంగ్రెస్‌తోని కలిసిపోవాలా లేదా వామపక్షాలతో కలిసిపోవాలా ? అని యోచిస్తోంది. రేపు ప్రధాని అభ్యర్థిత్వంపై కొరివి పెట్టకుండా మమతా బెనర్జీతో కలిసిపోవాలని రాహుల్‌ భావిస్తున్నారు. బెంగాల్‌లో నాలుగు సీట్లు సాధించుకోవాలంటే వామపక్షాలతో కలిసి పోవాలని అక్కడి రాష్ట్ర కాంగ్రెస్‌ కోరుకుంటోంది.

ఆ రోజు శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో ముందే మహాకూటమిని ఏర్పాటు చేయడం కన్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకొని ఫలితాల అనంతరం కూటమిగా ఏర్పడితే బాగుంటుందని కొంతమంది ప్రతిపక్ష నాయకులు సూచించారట. దాని వల్ల ప్రధాని అభ్యర్థి విషయంలో గొడవలు ఉండవని కూడా చెప్పారట. ముందే మహా కూటమిని ఏర్పాటు చేయడం బీజేపీకే కలసి వస్తుందని, అప్పుడు బీజేపీ పక్షాలు ‘మోదీ వర్సెస్‌ రాహుల్‌’ అంటూ ప్రచారం చేస్తారని, అలా చేయడం వల్ల మోదీ ముందు రాహుల్‌ తేలిపోయి మొత్తం కూటమి నష్టపోవాల్సి వస్తుందన్నది వారి వాదన. రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల, రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం, ఓటింగ్‌ జరుగుతుంది కనుక గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కూడా వారి అభిప్రాయం.

ఈ వాదనలో నిజం లేకపోలేదు! అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హంగ్‌ వస్తుందని పలు ముందస్తు సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఏది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించే అవకాశం ఉంది. ముందే మహా కూటమి ఏర్పడితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకన్నా ఎక్కువ సీట్లు వస్తే కూటమినే ఆహ్వానించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ, ప్రభుత్వం ఏర్పాటుకు అటల్‌ బిహారి వాజపేయిని ఆహ్వానించారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిన పార్టీగా ఆవిర్భవించడంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. ఈ రెండు ఉదంతాల్లో వారు తమ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి కారణాల రీత్య ముందే మహా కూటమిగా ఏర్పడాలన్నది కొందరు నాయకుల అభిప్రాయం.

ఇలాంటి తర్జనభర్జనలు జరుగుతుండగానే తమిళనాడులో డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ విషయంలో తాత్సారం చేయడం వల్ల ఈ కూటమిలో చేరాల్సిన పీఎంకే పార్టీ బీజేపీ కూటమిలో చేరిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్నాయి. సోనియా, రాహుల్‌ పోటీచేసే రెండు స్థానాలను మాత్రం ఆ పార్టీలు వదిలేశాయి. ఈసారి సోనియాకు బదులుగా ప్రియాంక గాంధీ పోటీచేసే అవకాశం ఉంది. పొత్తుకు సిద్ధమై ఎస్పీ, బీఎస్పీ పార్టీలపై ఒత్తిడిచేస్తే కాంగ్రెస్‌కు మరో మూడు లోక్‌సభ స్థానాలు దక్కవచ్చు. అలా కాదని ప్రియాంక గాంధీ వచ్చిందన్న అంచనాలతో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే అది బీజేపీకే మేలు చేయవచ్చు.

తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో నష్టపోయామన్న ఉద్దేశంతో ఈ సారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. ఈ కారణంగా పార్టీ నుంచి సీనియర్‌ నాయకులు వైఎస్‌ఆర్‌ పార్టీలోకి వలస వెళుతున్నారు. ఢిల్లీలో కూడా ఇప్పటికీ ఆప్, కాంగ్రెస్‌ పార్టీల పొత్తు పట్ల సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో పొత్తుకు బదులుగా హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలని అరవింద్‌ కేజ్రివాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అది ఇష్టం లేని కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో ఒంటరిగా వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది. ఇప్పటి వరకు పొత్తుల ఖరారులో పాలకపక్ష బీజేపీయే ముందుంది. అందుకు కారణం గెలుపే ప్రధాన లక్ష్యంగా పావులు కదపడం. గెలుపుతోపాటు తాను ప్రధాన మంత్రయ్యే అవకాశాలను జారవిడుచుకోరాదన్నది రాహుల్‌ గాంధీ లక్ష్యం అవడం వల్ల ఆయన పార్టీ వెనకబడి పోతోంది.

>
మరిన్ని వార్తలు