కాంగి'రేస్‌' పాట్లు

11 Jul, 2018 12:58 IST|Sakshi

ఎనిమిది నియోజకవర్గాల్లో నాయకుల కోసం వేట

పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే చాలు

పోటీకి నామమాత్రపు అభ్యర్థులైనా ఒకే

ఉన్న నేతల్ని కాపాడుకోవటానికి ఎత్తుగడ రాజకీయాలు

12న నగరంలో ఊమెన్‌ చాందీ పర్యటన

నియోజకవర్గాల వారీగా సమీక్షలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఒకప్పుడు రాజకీయ ఉద్దండులతో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ నేడు జిల్లాలో జవసత్వాలను కోల్పోయింది. ఉనికి కోసం పాట్లు పడుతోంది. కనీసం పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు నిర్వహించడానికైనా నేతలు దొరికితే చాలు అనే పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ హడావుడి మొదలెట్టింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నప్పటికీ కనీసం మెడకు గంట కట్టించుకునే నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇదే ప్రధాన అజెండాగా పార్టీ రాష్ట్ర వ్యవçహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీ గురువారం నెల్లూరు నగరానికి రానున్నారు. వరుస సమీక్షలు, సమావేశాలు అంటూ భారీ షెడ్యూల్‌ పెట్టుకొని ఒక రోజంతా నగరంలో ఉండి పాత నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

నాయకుల తెరమరుగై..
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గతంలో జిల్లా కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉండి రాష్ట్రస్థాయిలో హవా చాటిన నేతలంతా 2014 ఎన్నికలకు ముందే పార్టీ మారిపోవడం, మరికొందరు పూర్తిగా తెరమరుగైపోవడంతో పార్టీ పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. ముఖ్యంగా జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పూర్తిస్థాయిలో నేతలు లేని పరిస్థితి హస్తం పార్టీలో నెలకొంది. అలాగే రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలది కూడా దాదాపుగాఅదే పరిస్థితి. ఇక పార్టీలో ఉన్న ఒకరిద్దరు కీలక నేతలు వీలు కుదిరినప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాలు నిర్వహించి మిగిలిన సమయమంతా వ్యాపారాలు, వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండడంతో పార్టీ జిల్లాలో ఉనికి పాట్లు పడుతోంది. 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై పోటీచేసిన నేతల్లో ఎక్కువ మంది కనుమరుగయ్యారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో హవా సాగించిన నేదురుమల్లి, ఆనం కుటుంబాలు పూర్తిగా పార్టీని వీడి వేరే రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు.

దివంగత సీఎం వైఎస్సార్‌ మరణానికి ముందు వరకు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండేది. ఆయన మరణానంతరం, మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2014 ఎన్నికల్లో 10 స్థానాల్లో ఒక చోట కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు రాని పరిస్థితి. ప్రస్తుతం పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్న ఏకైక నేత పనబాక కృష్ణయ్య మాత్రమే. ఆయన సతీమణి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా పార్టీ కార్యక్రమాలకు సందర్భానుసారంగా మాత్రమే హాజరవుతున్నారు. డీసీసీ అధ్యక్షుడి హోదాలో పనబాక కృష్ణయ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆనం సోదరులు 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే పనబాక సొంత నియోజకవర్గం గూడూరుకే పరిమితమయ్యారు. దీంతో జిల్లాలో పార్టీ పూర్తి నిస్తేజంగా మారింది.

నేతలు కావలెను!
ఈ నెల 12న ఊమెన్‌ చాందీ మూడు ప్రధాన అంశాలతో నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉన్న నేతల్ని గుర్తించి వారి ఇంటికి వెళ్లి మరీ మంతనాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌లో వెలుగొందిన నేతలు ఇప్పటికే ఇతర పార్టీల్లో మంచి స్థానాల్లో ఉండటంతో ఎవరిని కలవాలనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకులంగా పార్టీలోకి వచ్చే నేతలు దాదాపు ఎవరూ లేని పరిస్థితి. అటు పాత నేతలు కానీ, ఇటు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న కొత్త నేతలు కానీ జిల్లాలో కనిపించని పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలో గూడూరు, ఉదయగిరి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు డబ్బు ఖర్చు పెట్టే నేతల కోసం అన్వేషణ సాగుతోంది.

ఉన్నారంటే ఉన్నారు అనే రీతిలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉన్నారే తప్ప కనీసం పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సముఖత చూపని పరిస్థితి. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి గడిచిన నాలుగేళ్లుగా ఇన్‌చార్జ్‌ లేకపోవడం గమనార్హం. ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో కనీసం కోటి మేరకు అయినా ఖర్చుపెట్టే నేతల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనివార్యం అని తెలిసి నేతలు ఎలా ఖర్చు పెడతారనేది ఇప్పుడు శ్రేణుల్లో నడుస్తున్న చర్చ. ఇక జిల్లాలో కనీసం మూడు నాలుగు స్థానాల్లో అయినా కొద్ది ఓట్లు సాధించటానికి వీలుగా నియోజకవర్గాలను ఎంపిక చేయనున్నారు. మొత్తం మీద 12న నెల్లూరు నగరానికి వచ్చే ఊమెన్‌ చాందీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి వెళ్లనున్నారు. 

మరిన్ని వార్తలు