ఒకే దెబ్బ... రెండు పిట్టలు

28 Aug, 2019 02:50 IST|Sakshi

రాష్ట్ర విభజన హామీల విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై దాడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ 

ఆ రెండు పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహం 

అంశాల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చే యోచన

సాక్షి, హైదరాబాద్‌: ఖాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఐటీఐఆర్, బయ్యారం స్టీల్‌ ప్లాంటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఇప్పుడు ఈ అంశాలనే అస్త్రాలుగా మలచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడంతో పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను రాజకీయంగా ఎండగట్టాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర విభజన హామీల అమలులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ విఫలమయ్యాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అవసరమైతే స్థానికంగా ఆందోళనలకు పిలుపునివ్వాలనే యోచిస్తున్నారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.   

ఆ రెండు పార్టీలూ చేసిందేం లేదు.. 
విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎయిమ్స్, హైకోర్టు విభజన మినహా మిగిలిన అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉండటం, వీటిని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నా ఎలాంటి కదలిక లేకపోవడాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. రాష్ట్ర విభజన హామీలను మరోమారు తెరపైకి తీసుకురావడంతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహం అమలు చేయాలని ఉత్తమ్‌ నిర్ణయించారు. ఈ అంశాలన్నింటిపై వారానికోసారి రాష్ట్రస్థాయిలో సమావేశాలు పెట్టి ప్రజానీకంలో చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. పార్టీ ఎంపీల బృందంతో కలిసి రాష్ట్రపతి, ప్రధానిలను కలిసి విజ్ఞప్తి చేయాలని కూడా నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు