మేమూ ‘ముందుకే’!

30 Jun, 2018 02:02 IST|Sakshi

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ 

టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేందుకు కార్యాచరణ మొదలు 

నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులతో నేడు కుంతియా భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు నవంబర్, డిసెంబర్‌లోనే ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోడానికి, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హైకమాండ్‌ సూచనల మేరకు పార్టీని, అభ్యర్థులను అన్ని విధాలా సన్నద్ధం చేసే దిశగా సన్నాహకాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా శనివారం గాంధీభవన్‌లో అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీమెంటరీ ఇన్‌చార్జీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియాతో పాటు కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ సహా ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు తదితరాలపై చర్చించనున్నారు.  

ఉత్తమ్‌ 100 రోజుల ప్రణాళిక 
దేశవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయాలు, ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కాంగ్రెస్‌ పార్టీని అలర్ట్‌ చేశాయి. తాజాగా ముందస్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్‌కు ఆ పార్టీ అంతే దీటుగా సమాధానం ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అని ప్రకటించిన ఉత్తమ్‌.. ఇందుకు 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ వివరాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడం లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికగానే ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ బాధ్యతలను ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు అప్పగించిన దృష్ట్యా వారికి ఆయా నియోజక వర్గ నేతలను పరిచయం చేయనున్నారు. వచ్చే నెల నుంచే కార్యదర్శులు 25 నుంచి 90 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయనుండటంతో వారికి అందించాల్సిన సమాచారంపై నేతలను సన్నద్ధం చేయనున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తి యాప్‌లో రిజిస్ట్రేషన్‌పై ఇందులో అవగాహన కల్పించనున్నారు. 

కుంతియాకు వీహెచ్‌ ఫిర్యాదు 
పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండదని హైకమాండ్‌ స్పష్టం చేసినా పార్టీ నేతలు కొందరు రహస్య మంతనాలు చేస్తుండటంపై పార్టీ వ్యవహారల ఇంఛార్జి కుంతియాకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అలాంటి కుట్రదారులపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదన్నారు.  

మరిన్ని వార్తలు