‘రాహుల్‌ క్షమాపణ చెప్పాలి’

28 Mar, 2019 17:28 IST|Sakshi

పఠాన్‌చెరు(మెదక్‌): గరీబీ హఠావో నినాదంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్‌ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆరోపించారు. పఠాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రసంగించారు. గరీబీ హఠావో నినాదంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తోన్న రాహుల్‌ గాంధీ మొదట క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గరీబీ హఠావో అనే నినాదాన్ని 1971లో రాహుల్‌ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ, 1989లో రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ ఎత్తుకుని దేశం నుంచి పేదరికాన్ని ఎందుకు పారదోలలేకపోయారని ప్రశ్నించారు. ఇలా పేదరికం పేరుతో దేశంలోని పేదలతో ఎన్నాళ్లు ఆటలాడతారని సూటిగా అడిగారు.

పేదలను అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు మోసం చేస్తారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినా ఇంకా పేదవాళ్లు పేదరికంలోనే ఎందుకు ఉన్నారో రాహుల్‌ దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందిర, రాజీవ్‌ గాంధీలు ఎందుకు పేదరికం పోగొట్టలేదు.. ఇది ప్రజలను మోసం చేయడం కాదా..ముందుగా ప్రజలకు బేషరుతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్‌ ఓట్లు అడగాలన్నారు. నిజంగా పేదరిక నిర్మూలన చేపడుతోంది సీఎం కేసీఆర్‌ మాత్రమేనని కొనియాడారు.

కాంగ్రెస్‌ రూ.200 పెన్షన్‌ ఇస్తే.. కేసీఆర్‌ ఆ పెన్షన్‌ను వేయి రూపాయలు చేశారు.. రైతు బంధు పేరుతో రైతులకు ఆర్ధికసాయం అందించారు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు షాదీ ముబారక్‌, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్ధికసాయం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.. ఆకలి చావులు లేవు.. వలసలు తగ్గాయి.. దేశమంతా మన పథకాలు అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.. పేద విద్యార్థుల చదువుల కోసం 500 ఆంగ్ల గురుకుల పాఠశాలలను కేసీఆర్‌ ప్రారంభించి వారి చదువులకు ఏడాదికి లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ తెస్తామన్నాం.. తెచ్చాం

‘తెలంగాణ తెస్తామని 2001లో చెప్పాం.. తెలంగాణ సాధించాం. వేయి రూపాయల పెన్షన్‌ ఇస్తామన్నాం.. ఇస్తున్నాం. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ పెన్షన్‌ రూ.2016 రూపాయలకు పెంచి ఇస్తాం. దసరా నాటికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు పైసా ఖర్చు లేకుండా పేదలకు అందిస్తాం. ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామ’ని హరీష్‌ వెల్లడించారు.

ఇంటికి పెద్ద కొడుకులా కేసీఆర్‌

ఇంటికి పెద్దకొడుకులా పెన్షన్లు పెంచిన ఏకైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిని 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని, ఏప్రీల్‌ 11న అందరూ ఓటు వేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు డిపాజిట్‌ గల్లంతయ్యే పార్టీలు అని, వాటికి ఓటు వేస్తే మోరీ వేసినట్లేనని వ్యాఖ్యానించారు. పోటీ కాంగ్రెస్‌, బీజేపీలతో కాదని సిద్ధిపేట నుంచి మెజార్టీ ఎక్కువ ఉంటుందా లేక పఠాన్‌ చెరు నుంచి మెజార్టీ ఎక్కువ వస్తుందా అన్నదే పోటీ అని అన్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు