ప్రియాంకకు నోటీసులు.. కాంగ్రెస్‌ స్పందన

2 Jul, 2020 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం ప్రియాంక గాంధీకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ చర్యపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. మోదీ ద్వేష, ప్రతీకార రాజకీయాలకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ‘ఇలాంటి చర్యలకు కాంగ్రెస్‌ భయపడదు. మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అంటే ఎంత ద్వేషం, పగ ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు. వారు ఇప్పుడు అని హద్దులు దాటారు. ప్రియాంక గాంధీని బంగళా ఖాళీ చేయమంటూ నోటీసులు పంపి ప్రధాని, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తమ ఆందోళనను వెల్లడించారు. కానీ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్‌ భయపడదు’ అంటూ ఆయన ఓ వీడియో మెసేజ్‌ను షేర్‌ చేశారు. (షాకింగ్‌ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..)

ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 35, లోడీ ఎస్టేట్స్‌ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆగస్ట్‌ 1 తర్వాత కూడా బంగళాలో కొనసాగితే ప్రియాంక వాద్రా జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్‌పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు