కూటమి పొత్తుల్లో కొసమెరుపు!

15 Oct, 2018 01:24 IST|Sakshi

కాంగ్రెస్‌ బీఫారం పైనే టీజేఎస్‌ పోటీ... టీపీసీసీ భేటీలో తెరపైకి ప్రతిపాదన

కోదండరాం అంగీకరిస్తే 8-10 మంది టీజేఎస్‌ నేతలకు టికెట్లు

సీఎంపీ అమలు కమిటీ చైర్మన్‌ బాధ్యతలు కోదండరాంకు అప్పగింత

డిప్యూటీ సీఎం హోదాతో తగిన గౌరవం

పొత్తుల బాధ్యత జానారెడ్డి టీమ్‌కు.. 

వీలైనంత త్వరగా పొత్తుల వ్యవహారంపై నిర్ణయం

కాంగ్రెస్‌ కోర్‌కమిటీలో కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటును జాగ్రత్తగా అంచనా వేస్తున్న కాంగ్రెస్‌.. ఈ దిశగా మహాకూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్‌ తీసుకొచ్చింది. పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో వినూత్న ప్రతిపాదన చేసింది. టీజేఎస్‌ అభ్యర్థులు తమ పార్టీ గుర్తు (ఇంకా రావాల్సి ఉంది)తో ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుం దని అందువల్ల.. వీరిని కాంగ్రెస్‌ బీఫారంపైనే పోటీ చేయించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు కాస్త.. అటు, ఇటుగానైనా అంగీకారం తెలపాలని ఆదివారం గోల్కొండ హోటల్‌లో జరిగిన పార్టీ కోర్‌కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై టీజేఎస్‌ను ఒప్పించడంతోపాటు.. కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య పొత్తు సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్‌ నేత జానారెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాతో పాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ గౌడ్, రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్‌లు పాల్గొన్నారు. సమావేశంలో కూటమిలో సీట్ల సర్దుబాటు, ఈనెల 20న రాహుల్‌ గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
 
కూటమి పార్టీలకు కాంగ్రెస్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న స్థానాలు
తెలుగుదేశం పార్టీకి.. 10-12
టీజేఎస్‌కు.. 8-10
సీపీఐకి.. 2

కోదండకు డిప్యూటీ సీఎం హోదా 
సీట్ల సర్దుబాట్లపై జరిగిన చర్చలో టీడీపీకి 10–12 స్థానాలు, టీజేఎస్‌కు 8–10 స్థానాలు, సీపీఐకి 2 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే, టీజేఎస్‌ అభ్యర్థులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆ పార్టీ చీఫ్‌ ప్రొఫెసర్‌ కోదండరాం గౌరవానికి భంగం కలిగించకుండా.. టీజేఎస్‌ కోరుకుంటున్నట్లుగా.. 8–10 సీట్లు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. టీజేఎస్‌కు ఇచ్చే సీట్లలో పోటీచేసే నేతలకు కాంగ్రెస్‌ బీఫారం ఇచ్చి హస్తం గుర్తుపైనే బరిలో దించాలని నిర్ణయించారు. ఇలాగైతేనే.. కూటమికి మేలు జరుగుతుందని, టీజేఎస్‌ గుర్తు మీద పోటీ చేయడం ఇబ్బందికరంగానే ఉంటుందనే అభిప్రాయం వెల్లడించారు. అయితే, ఆ పార్టీ కోరుతున్న విధంగా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించి కమిటీ చైర్మన్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను టీజేఎస్‌ నేతల ముందుపెట్టి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చాలనుకుంటున్నారు. కోదండరాంను పోటీ చేయించడం కన్నా.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. కోదండరాం పర్యటనల కోసం అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్‌ సమకూర్చాలని, ఆయన పోటీలో ఉన్నదాని కన్నా ప్రచారంలో కీలకంగా ఉండడమే కూటమికి మేలు చేస్తుందని కోర్‌కమిటీ సమావేశంలో అభిప్రాయానికి వచ్చారు. 
 
‘జానా అండ్‌ కో’బాధ్యతలు 
కూటమి పార్టీలను సమన్వయపరిచి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి బృందానికి అప్పగిస్తూ కోర్‌కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, పి.వినయ్‌కుమార్‌లను సభ్యులుగా ఉంచాలని, ఈ నలుగురి బృందం ఇతర పార్టీలతో పొత్తుల చర్చల్లో పాల్గొనాలని, మిగిలిన పార్టీ నేతలు ఇతర కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయించారు. 
 
టీజేఎస్‌ నేతలతో భేటీ 
కోర్‌కమిటీ సమావేశం ముగిసిన వెంటనే జానారెడ్డి తన నివాసంలో టీజేఎస్‌ ముఖ్య నేతలు దిలీప్‌ కుమార్, రచనా రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కోర్‌కమిటీ ప్రతిపాదనలను జానారెడ్డి టీజేఎస్‌ నేతల ముందుంచారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై పార్టీ అధినేత కోదండరాంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు వెల్లడించారు. సమావేశం అనంతరం దిలీప్‌ కుమార్, రచనా రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చించినట్టు తెలిపారు. తమ పార్టీ తరఫున పోటీచేయాలనుకుంటున్న 36 మంది జాబితాను కాంగ్రెస్‌కు ఇచ్చామని, ఎంతమందికి సీట్లు ఇస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య కాదని, ఈ విషయంలో టీజేఎస్‌ అసంతృప్తితో ఉందన్నది అవాస్తవమన్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వస్తాయని వెల్లడించారు.  
కాంగ్రెస్‌ గూటికి రాములు నాయక్‌? 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆదివారం హోటల్‌ గోల్కొండకు వచ్చారు. కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే హోటల్‌కు వచ్చిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర నేతలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చించి సమాచారం ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

కొడంగల్‌లో రాహుల్‌ సభ? 
ఈనెల 20న రాహుల్‌ పర్యటన ఏర్పాట్లపై కూడా కాంగ్రెస్‌ కోర్‌కమిటీ చర్చించింది. భైంసా, కామారెడ్డిలతో పాటు హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగే రాహుల్‌ పర్యటనను విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఈనెల 27న మరోమారు రాహుల్‌ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఎక్కడ సభలు పెట్టాలన్న దానిపై కూడా చర్చించారు. వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో కూడా రాహుల్‌ సభ ఏర్పాటు చేయించాలన్నదానిపై చర్చ జరిగింది. కొడంగల్‌లో రాహుల్‌ సభ జరిగితే.. దక్షిణ తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందన్న కోణంలో చర్చ జరిగినప్పటికీ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.  

మరిన్ని వార్తలు