‘తుమకూరు’ కథ సుఖాంతం

30 Mar, 2019 08:48 IST|Sakshi

సాక్షి బెంగళూరు : కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలివిడతలో జరిగే 14 నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా తుమకూరు పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగిన సిట్టింగ్‌ ఎంపీ ఎస్‌పీ ముద్దహనుమేగౌడ ఎట్టకేలకు పోటీ నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌- జేడీఎస్‌ జత కట్టాయి. ఇందులో భాగంగా తుమకూరు స్థానాన్ని జేడీఎస్‌కు ఇవ్వడంతో కాంగ్రెస్‌ ఎంపీ అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే పార్టీ పెద్దలు డిప్యూటీ సీఎం పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు శుక్రవారం ఉదయం బెంగళూరులోని సంజయ్‌నగర్‌లో ఉన్న ముద్దహనుమేగౌడ నివాసానికి వెళ్లి చర్చించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి హెచ్‌డీ దేవెగౌడకు మద్దతుగా నిలవాలని కోరారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సూచించారు. దీంతో మైత్రి ధర్మం మేరకు దేవెగౌడ తరఫున ప్రచారం కూడా చేస్తానని ముద్దహనుమేగౌడ తెలిపారు.

దేవెగౌడకు మార్గం సుగమం..
తన సొంత నియోజకవర్గం హాసన్‌ను మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు వదిలిపెట్టి మాజీ ప్రధాని దేవెగౌడ తుమకూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే తుమకూరు కాంగ్రెస్‌ ఎంపీ ముద్దహనుమేగౌడ తనకు టికెట్‌ రాలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ రెబల్‌గా నామినేషన్‌ పత్రాలు సమర్పించడంతో అందరి దృష్టి తుమకూరుపై మళ్లింది. దేవెగౌడ హాసన్‌ వదిలి తుమకూరు రావడంతోనే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే గత గురువారం రాత్రి ముద్దహనుమేగౌడతో ఏఐసీసీ రాహుల్‌గాంధీ, మాజీ సీఎం సిద్ధరామయ్య ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని సూచించారని తెలుస్తోంది. ఈక్రమం లో ముద్దహనుమేగౌడ మనసు మా ర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా తుమకూరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎన్‌ రాజణ్ణ కూడా పార్టీ పెద్దల సూచ న మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈమేరకు ఇద్దరు నాయకులు శుక్రవారం తుమకూరు వెళ్లి నామినేషన్‌ పత్రాలు వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు మార్గం సుగమమైంది. (చదవండి : (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!)

మరిన్ని వార్తలు