చంద్రబాబు పాలనపై కాంగ్రెస్‌ చార్జ్‌షీట్‌

8 Jun, 2018 16:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్‌ పార్టీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ నేతలు శుక్రవారం చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. అనంతరం పల్లంరాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఎన్డీఏలో ఉండి రాష్ల్రం కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందన్నారు. విభజన చట్టం హామీలను సాధించడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందని, ఈరోజు నుంచి వారం పాటు ప్రజావంచన వారంగా నిరసనలు తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.

చర్చకు చంద్రబాబు సిద్ధమా?
విభజన హామీల్లో ఉన్నవాటి కంటే ఎక్కువ చేస్తామని ఆనాడు బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాయని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్ల పాలనపై కాంగ్రెస్‌ విడుదల చేసిన చార్జ్‌షీట్‌లోని ప్రధానాంశాలపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. డ్వాక్వా మహిళకు రూ. 30 వేలు మాఫీ చేయాలి కానీ రూ. 4 వేలే చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు లేదు.. పైగా కొత్త ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. కాపులకు ఇచ్చిన హామీలేమయ్యాయని రఘువీరా ప్రశ్నించారు. పోలవరంపై కమీషన్లకు కక్కుర్తిపడి ఆలస్యం చేస్తున్నారన్నారు. దుగరాజుపట్నం పోర్టు, రైల్వే జోన్‌ ఏమయ్యాయి.. నాలుగేళ్లలో అన్నీ శాఖల్లో అభివృద్ధి శూన్యం..ఇందులోనే చంద్రబాబు పాలన నంబర్‌వన్‌ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు