ఆడియో క్లిప్ విడుదల చేసిన కాంగ్రెస్

18 May, 2018 20:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని బీజేపీ చెబుతుండగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఎత్తులకు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. తమ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించింది. అందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఒక ఆడియో క్లిప్ ను ఆ పార్టీ విడుదల చేసింది. సీఎం యెడ్యూరప్ప తరపున గాలి జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశంలో దీనికి సంబంధించి ఒక  ఆడియోను విడుదల చేశారు. అయితే, వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ అది  ఫేక్‌ ఆడియో క్లిప్‌ అంటూ ఖండించింది.

‘‘యెడ్యూరప్పకు మద్ధతు ఇస్తే నీ లైఫ్‌సెటిల్‌ చేస్తా. రూ. 150 కోట్లతోపాటు మంత్రి పదవి దక్కేలా చూస్తా. పాత విషయాలు మరిచిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే నేరుగా మీతో మాట్లాడుతారు. శివన్నగౌడ గతంలో నా మాట వినే మంత్రి అయ్యారు. రాజీవ్‌ గౌడ నా వల్లే అభివృద్ధి చెందారు. ఇవాళ శివన్న గెలిచినా లాభం లేదు. నేరుగా పెద్ద వాళ్లతో మాట్లాడిస్తా. నువ్వు మంత్రివి అవుతావ్‌... నువ్వు ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తికన్నా వందరెట్లు ఎక్కువ సంపాదిస్తావ్‌ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసన్న గౌడ‌ (రాయచూర్‌)తో మంతనాలు జరిపినట్టుగా ఆ ఆడియో క్లిప్ లో వినిపిస్తోన్న విషయం ఉగ్రప్ప మీడియాకు వెల్లడించారు. ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ‘మీపై గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేయలేను’ అని బసన్న బదులిచ్చారని చెబుతూ, ఇదే తరహాలో మరికొందరిని కూడా ప్రలోభపెట్టాలని చూశారని ఉగ్రప్ప బీజేపీపై మండిపడ్డారు. మొదట్లో 25 కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయలు ఇస్తామంటూ బేరసారాలకు దిగుతోందని ఉగ్రప్ప ఆరోపించారు. ఈఆరోపణలకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ కూడా ఓ ట్వీట్‌ చేసింది.

బీజేపీ స్పందన.. కాగా, ఈ ఆడియో క్లిప్‌పై బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ స్పందించారు. అది ఫేక్‌ క్లిప్‌ అని, కాంగ్రెస్‌ నీచపు రాజకీయాలకు తెరలేపిందని ఆయన మీడియాకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు