సచిన్‌ పైలట్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌

14 Jul, 2020 13:47 IST|Sakshi

పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం పదవుల నుంచి తొలగింపు

జైపూర్‌/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రెండోసారి కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీకి డుమ్మా కొట్టిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ వేటు వేసింది. సచిన్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు. గత నాలుగు రోజులుగా అధిష్టానం అనేకమార్లు జరిపినప్పటికీ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదని సుర్జేవాలా ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.

అంతకుముందు జరిగిన సీఎల్పీ భేటీలో 102 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు తెలిసింది. సీఎం అశోక్‌ గహ్లోత్ నాయకత్వాన్ని బలపరిచిన ఎమ్మెల్యేల డిమాండ్‌తో కాంగ్రెస్‌ చర్యలు చేపట్టింది. పైలట్‌తోపాటు మరో ఇద్దరు అసమ్మతి మంత్రులు రమేష్‌మీనా, విశ్వేంద్రసింగ్‌లను కూడా మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు సీఎల్పీ భేటీకి హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా క్రమశిక్షణా చర్యలకు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పైలట్‌ స్థానంలో రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా గోవింద్‌ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సొంత బలం 107. ప్రభుత్వ మనుగడకు 101 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం 102 ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది.

తనను పదవుల నుంచి తొలగించడంపై సచిన్‌ పైలట్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘వాస్తవాన్ని వేధించగలరు, కాని ఓడించలేరు’ అంటూ ట్వీట్‌ చేశారు.
(చదవండి: వీడని ఉత్కంఠ.. పంతం వీడని సచిన్‌)

మరిన్ని వార్తలు