ప్రత్యేక సమావేశాల ప్రతిపాదన.. బీజేపీ కౌంటర్‌

7 Apr, 2018 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పట్టుమని గంటల లెక్కన్న కూడా బడ్జెట్‌ సమావేశాలు జరగకుండా.. 23 రోజులు వాయిదాల పర్వంతోనే సరిపోయింది. కాలయాపనతోపాటు సుమారు రూ.200 కోట్ల ప్రజా ధనం సభ నిర్వహణ పేరిట వృధా అయ్యింది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలతో నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక సమావేశాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది.  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ ఈ మేరకు రాజ్యసభ చైర్‌పర్సన్‌ వెంకయ్యనాయుడికి శుక్రవారం ఓ లేఖ రాశారు.

మే లేదా జూన్‌ నెలలో రెండు వారాలు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాలని లేఖలో కోరారు. ‘ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీనికి తోడు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. వాయిదాల పర్వంతో పార్లమెంట్‌ ప్రతిష్ఠ ఇప్పటికే దెబ్బతింది. ప్రత్యేక సమావేశాలను నిర్వహించటం ద్వారా కాస్తైనా ఊరట కలిగే అవకాశం ఉంటుంది’ అని జైరామ్‌ లేఖలో వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సమావేశాలు ఇలా అర్థరహితంగా ముగియటానికి అన్ని పార్టీలు కారణమన్న వెంకయ్య అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని.. కానీ, సభను సజావుగా నిర్వహించగలిగే మార్గాలు ఉన్నప్పటికీ.. బీజేపీ ఆ పని చేయలేదన్న విషయాన్ని గమనించాలని జైరామ్‌ తెలిపారు. 

జైరామ్‌కు బీజేపీ కౌంటర్‌...
ఇక ఈ లేఖపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడుతూ... జైరామ్‌పై మండిపడ్డారు. ‘సభ సజావుగా సాగకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు మరో సెషన్స్‌ నిర్వహించాలని కోరుతున్నారు. వాళ్లు మళ్లీ జీతాలు, అలవెన్సులు కావాలనుకుంటున్నారా?’ అంటూ విజయ్‌ గోయల్‌ తెలిపారు. కాగా, సభ సజావుగా సాగకపోవటంతో బీజేపీ ఎంపీలు ఈ 23 రోజుల తమ జీతాలను స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా