రిజర్వేషన్లపై సర్కారు ‘దొంగాట’!

22 Mar, 2018 00:59 IST|Sakshi

ఆధారాలతో సహా బయటపెట్టిన కాంగ్రెస్‌

∙రాష్ట్ర ప్రభుత్వ బిల్లుకు వివరణ కోరుతూ కేంద్రం లేఖలు

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలోని మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోందా? ఈ విషయంలో కేంద్రం నుంచి ఎన్నిసార్లు లేఖలు వచ్చినా వాటికి జవాబివ్వకుండా, హోంశాఖ అభ్యంతరాలకు వివరణ ఇవ్వకుండా జాప్యం చేస్తోందా? ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదించుకున్న బిల్లును కేంద్రం వద్ద ఆమోదింపజేసుకోవడంలో ఆత్మరక్షణలో పడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు.

ఈ మేరకు ఆధారాలను కూడా బయటపెట్టారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్‌ వెల్లడించిన ఈ ఆధారాలను పరిశీలిస్తే.. రాష్ట్రం పంపిన బిల్లుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ పరిధిలోని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల విభాగం పంపిన మెమొరాండాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. తమ అభ్యంతరాలకు త్వరగా వివరణ పంపా లంటూ ఆ తర్వాత రాసిన రెండు లేఖలకు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

రిజర్వేషన్ల పెంపు కథాకమామిషు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు 4 శాతం, గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ తాము అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు గత ఏప్రిల్‌ 16న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లు ఆమోదించింది. ముస్లిం రిజర్వేషన్లను బీసీ–ఈ కోటా కింద 12 శాతం, గిరిజనులకు ఎస్టీ కోటాలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఆ బిల్లును కేంద్రానికి పంపింది.

కాంగ్రెస్‌ వర్గాలు బుధవారం బయటపెట్టిన ఆధారాల ప్రకారం.. రాష్ట్రం ఆమోదించిన బిల్లును పరిశీలించిన కేంద్రం అందులోని అంశాలపై న్యాయ పరిశీలన జరిపాక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 25న రాసిన లేఖకు జవాబుగా ముస్లిం రిజర్వేషన్ల విషయంలో గత డిసెంబర్‌ 11న, గిరిజన రిజర్వేషన్ల విషయంలో అదే నెల 18న మెమొరాండాలు పంపింది. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించింది.

ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచడానికి.. 1992లో సుప్రీంకోర్టు విచారించిన ఇంద్రాసహాని కేసును ఉటంకిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పింది. 9 మంది న్యాయ మూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును ఉల్లంఘిస్తూ ప్రతిపాద నలు పంపినట్లు అందులో పేర్కొంది. సుప్రీం చెప్పిన విధంగా రిజర్వేషన్లను 50 శాతం కన్నా పెంచేందుకు గల అసాధారణ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మైనార్టీలకు 4.5 కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసిందని, దీన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని వెల్లడించింది. డిసెంబర్‌ 18న పంపిన మరో మెమొరాండంలో.. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజన జనాభా 9.08 శాతం ఉన్నందున వారికి 9.08% మేర రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొంది. కానీ రాష్ట్రం వీటికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తమ వాదనలు వినిపిస్తూ కేంద్రానికి మళ్లీ లేఖలు పంపలేదు. దీంతో ఈ ఏడాది జనవరి 2న కేంద్ర హోం శాఖ పరిధిలోని న్యాయ విభాగ కార్యదర్శి థంగ్‌ఖోలున్‌ హోకిప్‌ పేరిట అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంకు ఓ లేఖ వచ్చింది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా డీవోపీటీ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ తాము రాసిన లేఖలోని అంశా లకు ఎలాంటి వివరణ ఇంతవరకు ఇవ్వలేదని, వెంటనే పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో కేంద్ర హోంశాఖ.. అసెంబ్లీ కార్యదర్శికి ఈ నెల 1న మరో లేఖను పంపింది. ఇప్పుడు ఈ లేఖలనే కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర సర్కారు దొంగాట ఆడుతున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపిస్తోంది.  


పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుంటారా?: షబ్బీర్‌
రిజర్వేషన్ల పెంపు విషయంలో ముస్లిం, గిరిజన వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చిన లేఖలను బయటపెట్టారు. కేంద్రం అడిగిన వాటికి ఎందుకు బదులివ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘రిజర్వేషన్ల విషయంలో ఇక్కడ దొంగాట ఆడుతూ పార్లమెంటులో మాత్రం వన్‌ కంట్రీ–వన్‌ నేషన్‌ అంటూ ప్లకార్డులు పట్టుకుంటారా? కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దానికి మద్దతిస్తే ఈ రిజర్వేషన్ల అంశంపై కూడా కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. అయినా గొడవ చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇవన్నీ అడుగుతామనే మమ్ముల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు’’అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు