కాంగ్రెస్‌కు ఇప్పటికీ చిక్కు ప్రశ్నే!

18 Mar, 2019 20:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రాల్లోను పాలకపక్ష  బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ముందుకు వెళ్లాలా లేదా 2024లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబీలకు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురైన ప్రశ్న. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానాల విషయంలో మళ్లీ అదే ప్రశ్న వెలువడింది.

ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయవతి నాయకత్వంలోని బీఎస్పీ స్పష్టం చేయడం, యూపీలో సోనియా, రాహుల్‌ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి, అమేథి లోక్‌సభ నియోజక వర్గాలను వదిలేసి అక్కడ మిగతా అన్ని సీట్లకు బీఎస్పీ–ఎస్పీ సంయుక్తంగా పోటీ చేస్తోందంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సంకటంలో పడింది. భవిష్యత్‌ పొత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుహృద్భావ చర్యగా తాను కూడా బీఎస్పీ, ఎస్సీ సీనియర్‌ నాయకులు పోటీ చేస్తున్న ఏడు సీట్లకు అభ్యర్థులను నిలబెట్టడం లేదని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. అంటే 9 స్థానాల్లో పరస్పరం పోటీ పడకుండా కాంగ్రెస్, బీఎస్పీ కూటమి ఒక ఒప్పందానికి వచ్చినట్లే.

అయితే యూపీలోని మిగతా 71 లోక్‌సభ స్థానాల సంగతేమిటీ ? ఈ స్థానాల్లో త్రిముఖ పోటీ జరిగినట్లయితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందన్న ఆందోళన కాంగ్రెస్‌ను పట్టి పీడిస్తోంది. ఓటర్లు తెలివిగల వారని, సైద్ధాంతికంగా వారు ఓటేస్తారని రాజకీయ శాస్త్రవేత్త సుహాస్‌ పాల్‌షికర్‌ అంటున్నారు. అవినీతి కళంకాన్ని పక్కన పెడితే పాలకపక్ష బీజేపీని ఓడించేందుకు మిత్రపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు ఓటర్లకు తెలుసు. కనుక వారు విజ్ఞతతో ఓటేయగలరన్నది ఆయన వాదన.

దశాబ్దాల కారణంగా పడిపోతున్న కాంగ్రెస్‌ పార్టీని తిరిగి నిలబట్టి పునాదుల నుంచి బలోపేతం చేయడానికి కొంత సమయం అవసరం. ఈసారి కూడా నరేంద్ర మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేమని కాంగ్రెస్‌ భావించినట్లయితే అందుకు వ్యూహం వేరే ఉంటుంది. అంటే మిత్ర పక్షాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటూ పాలక పక్షాన్ని గట్టిగా ఎదుర్కొంటూ ముందుకు పోవడం. నరేంద్ర  మోదీని మరోసారి అధికారంలోకి రానీయడం కాంగ్రెస్సేతర మిత్రపక్షాలకు కూడా ఇష్టం లేదు. అందుకని చివరి నిమిషంలో కాంగ్రెస్‌కు, బీఎస్పీ కూటమికి పొత్తు కుదరుతుందన్న ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఢిల్లీ విషయంలోనూ అలాగే వార్తలు వచ్చాయి. చివరకు ఏడో సీటుకు కూడా అక్కడ అప్‌ ప్రకటించేసింది. పొత్తులతో ముందుకు వెళ్లాలా? వీలైన చోట్ల పొత్తులతో వీలుకాని చోట్ల స్నేహపూర్వక పోటీకి దిగాలా? అన్నది కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికీ చిక్కు ప్రశ్నే. ఓటర్ల మనోభావాలు ముందుగా తెలిస్తే తప్పా ఈ చిక్కు వీడదుగదా!

మరిన్ని వార్తలు