కాంగ్రెస్, ఎస్పీల వినూత్న వైఖరి

3 Mar, 2018 16:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు 2014లో ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్, సమాజ్‌వాజ్‌ పార్టీలు ఎలాగైనా అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంతో ఆ తర్వాత 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అయినా ఫలితం లేదు. మరోసారి పరాభవం తప్పలేదు. అందుకని ఈనెల 11వ తేదీన రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో విడి విడిగా పోటీ చేస్తూ వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే.

యాదవుల పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం సమాజ్‌వాది పార్టీ నాయకులు అఖిలేష్‌ యాదవ్‌ రెండు లోక్‌సభ స్థానాలకు ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన నిషాద్, పటేల్‌ సామాజికి వర్గాలకు చెందిన అభ్యర్థులను పోటీకి దించారు. నిషాద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషాద్‌ కుమారుడు ప్రవీణ్‌ నిషాద్‌ను గోరఖ్‌పూర్‌ నుంచి, నాగేంద్ర పటేల్‌ ఫూల్పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ భారతీయ జనతా పార్టీ ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో రెండు సీట్లను కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించింది.

గోరఖ్‌పూర్‌ నుంచి డాక్టర్‌ సుర్హిత ఛటర్జీ కరీం, ఫూల్పూర్‌ నుంచి మానిష్‌ మిశ్రా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరఫున గోరఖ్‌పూర్‌ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉపేంద్ర శుక్లా, ఫూల్పూర్‌ నుంచి కౌశాలేంద్ర సింగ్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో దాదాపు 50 శాతం ఉన్న బ్రాహ్మణ ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌ వైపు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల వారంతా కాంగ్రెస్‌కు దూరమై బీజేపీకి ఓట్లు వేశారన్నది కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ. ఈసారి పొత్తు లేనందున, అందులోనూ బ్రాహ్మణులకే టిక్కెట్లు ఇచ్చారన్న కారణంగా ఓటు వేస్తారని పూర్తి విశ్వాసం.

గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెంగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గోరఖ్‌పూర్‌ అర్బన్‌ సెంగ్మెంట్‌లో 56 శాతం ఓట్లు, గోరఖ్‌పూర్‌ రూరల్‌లో 35 శాతం, సహజాన్వాలో 34 శాతం, పిప్రియాక్‌లో 33 శాతం, కాంపియర్‌గంజ్‌లో 42 శాతం ఓట్లు వచ్చాయి. ఈ అంశాలను కాంగ్రెస్‌ పార్టీ పరిగణలోకి తీసుకొంది. గోరఖ్‌పూర్‌ రూరల్, సహజాన్వా, పిప్రియాక్, కాంపియర్‌గంజ్‌ అసెంబ్లీ సెంగ్మెంట్లలో నిషాద్, ముస్లింలు, యాదవ్‌లు ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నరన్నది సమాజ్‌వాది పార్టీ అంచనా. అందుకే ఇక్కడ ఓబీసీ అభ్యర్థులను రంగంలోకి దించింది.

కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య ఈ ఉప ఎన్నికలకు ప్రత్యక్ష పొత్తు లేకపోయినా, రెండు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నదన్న విషయం తెలుస్తోంది. అగ్రవర్ణాల ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌ లేదా సమాజ్‌వాది పార్టీల అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందన్నది అవగాహన. ఏదేమైనా బీజేపీ అభ్యర్థులను ఓడించడమే ఇరు పార్టీల లక్ష్యం. ఈ లక్ష్యం సాధించేందుకు రెండు పార్టీల మధ్యనున్న అవగాహన ఎంతవరకు తోడ్పడుతుందో చూడాలి!

మరిన్ని వార్తలు