జీఎస్టీతో దివాళి కాదు.. దివాళా : కాంగ్రెస్‌

8 Oct, 2017 11:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వస్తు సేవల సుంకం మార్పులతో దేశ ప్రజలకు ముందుగానే దివాలి (దీపావళి) వచ్చిందని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆయన ప్రకటనపై ఘాటుగానే స్పందిస్తున్నాయి. దివాళి స్థానంలో దివాళా అనే పదం బావుంటుందని కాంగ్రెస్‌ పార్టీ వ్యంగ్యస్త్రాలను సంధించింది.  

‘బహుశా ఆయన(మోదీ) పొరపాటున ఆ ప్రకటన ఇచ్చి ఉంటారేమో. దివాళా బదులు దివాళి అని చెప్పాల్సింది. ప్రస్తుత పరిస్థితులకు దివాళా అన్నదే సరిగ్గా సరిపోతుంది. జీఎస్టీ సంస్కరణలను ప్రధాని పండగతో పోల్చారు. కానీ, అది ప్రజల జీవన శైలిని ఏ మాత్రం మార్చలేకపోయింది. సామాన్యుడు ఇంకా కష్టాలను ఎదుర్కుంటూనే ఉన్నాడు. తప్పుడు వాగ్థానాలతో ఇంకా మభ్య పెట్టాలనే ఆయన చూస్తున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. బీజేపీ పార్టీని అధికారం కోల్పోయినప్పడే ప్రజలకు నిజమైన దీపావళి అని మరో నేత అజోయ్‌ కుమార్‌ చెప్పారు. ధనికులకు, వ్యాపారవేత్తల గురించే మోదీ ఆలోచిస్తున్నారు తప్ప.. మధ్య తరగతిఽపేదల గురించి మోదీ ఏ మాత్రం ఆలోచించట్లేదని అజోయ్ అన్నారు. 

కాగా, జీఎస్టీ కింద 27 వస్తువులపై పన్ను తగ్గిస్తూ.. జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని స్వాగతించిన విషయం తెలిసిందే. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు 15 రోజుల ముందుగానే దీపావళి వచ్చిందని గుజరాత్‌ పర్యనటలో ఆయన పేర్కొన్నారు. అయితే దీనిని దివాళీ గిఫ్ట్‌గా దేశ ప్రజలు స్వీకరించడం లేదని శివసేన పేర్కొంది. మోదీ ప్రభుత్వ పాలన పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరని, అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని శివసేన అధినేత ఉద్దవ్‌ థాక్రే అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు