ఆప్‌ సరే.. ఆ బీజేపీ ఎమ్మెల్యేల సంగతేంటి?

23 Jan, 2018 09:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారం తెరపైకి వచ్చింది. వారి పై కూడా వేటు వేయాల్సిందేనన్న డిమాండ్‌ను కాంగ్రెస్‌ పార్టీ లేవనెత్తుతోంది. 

‘‘ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు సబబు అయినప్పుడు ఇక్కడ(ఛత్తీస్‌గడ్‌) బీజేపీ ఎమ్మెల్యేలపై కూడా వేటు పడాల్సిందే. కానీ, రెండేళ్లుగా ఈ వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నానుస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్‌ కూడా భాగస్వామి కావటం దారుణం’’అని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి మహ్మద్‌ అక్బర్‌ సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. 

గతంలో రమణ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై వేటు వేయాలని కాంగ్రెస్‌ నేత అక్బర్‌ 2016లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సమాధానమిచ్చిన ఈసీ.. ఒకవేళ గవర్నర్‌ సిఫార్సు చేస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీంతో ఆయన గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టండన్‌కు కూడా ఓ లేఖ రాశారు. 

గవర్నర్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో గతేడాది ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో అక్బర్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే పార్లమెంటరీ కార్యదర్శుల అధికారాలను ఉపసంహరించుకోవాలని రమణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా ఆ ఆదేశాలను అమలు చెయ్యటంతో ప్రస్తుతం వారంతా మంత్రుల మాదిరిగానే లాభాలను(కారు, బంగ్లా, తదితరాలు) అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు పడటంతో.. బీజేపీ ఎమ్మెల్యేల సంగతిని కాంగ్రెస్‌ ప్రస్తావిస్తోంది. 

ప్రభుత్వం కూలిపోతుందనే... 
ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 49 మంది, కాంగ్రెస్‌ పార్టీకి 39 మంది, బీఎస్పీ ఒకరు, స్వతంత్ర్య అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఒకవేళ ఆ 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆ భయంతోనే బీజేపీ గవర్నర్‌తో కలిసి రాజకీయాలు నడుపుతోందని అక్బర్‌ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని.. అలాకానీ పక్షంలో రాష్ట్రపతిని కలిసి జోక్యం చేసుకోవాలని కోరతామని అక్బర్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు